English | Telugu
గబ్బర్ సింగ్ లో పవన్ తండ్రిగా హరికృష్ణ
Updated : Jun 16, 2011
"గబ్బర్ సింగ్" లో పవన్ తండ్రిగా హరికృష్ణ నటిస్తారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, "షాక్", "మిరపకాయ్" చిత్రాల ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలో గణేష్ నిర్మిస్తున్న చిత్రం" గబ్బర్ సింగ్". బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన "దబాంగ్" సినిమానే తెలుగులో "గబ్బర్ సింగ్ " పేరుతో పునర్నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ "గబ్బర్ సింగ్" సినిమాలో ముందుగా రెబెల్ స్టార్ కృష్ణం రాజు, సహజనటి జయసుధ హీరో పవన్ కళ్యాణ్ కి తల్లిదండ్రులుగా నటిస్తారని వినిపించింది. కాని జయసుధకి కిడ్నీ సమస్యలేవో ఏర్పడటంతో ఆమె హాస్పిటల్లో చేరారట.
అదీకాక నందమూరి హరికృష్ణ అయితే తండ్రి పాత్రకు సరిగ్గా సరిపోతారనే అభిప్రాయంతో ఈ సినిమా యూనిట్ ఉందట. అంతే కాకుండా హరికృష్ణ కుడా ఆ పాత్రలో నటించటానికి ఉత్సాహం చూపిస్తున్నారని తెలిసింది. ఈ చిత్ర నిర్మాత గణేష్ పి.సి.సి.అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణకు బాగా కావలసిన వాడు. ఈ సినిమాలో నటిస్తే చంద్రబాబు నాయుడుకు, హరికృష్ణకూ మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింతగా దెబ్బతినే అవకాశముందని సినీ, రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఈ సినిమా అంతర్లీనంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా ప్రభావితం చేసేలా ఉంది.