English | Telugu

రాజ‌మౌళి సినిమాల్లో ఇక అలాంటివి ఉండ‌వ‌ట‌

తెలుగు సినిమాని సాంకేతికంగా ప‌ది మెట్లు పైకి ఎక్కించాడు రాజ‌మౌళి. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో ఎంత మాయ చేయొచ్చో... చేసి చూపించాడు. మ‌గ‌ధీర అందుకు తొలిమెట్ట‌యితే... ఇప్పుడు బాహుబ‌లితో ఏకంగా శిఖ‌రంమీద కూర్చోబెట్టాడు. బాహుబ‌లి 1లో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, సీజీ వ‌ర్క్ లేని సీన్ లేదంటే న‌మ్మండి. ఇప్పుడు బాహుబ‌లి 2లోనూ అంతే. బాహుబ‌లి రెండో భాగంలో సీజీ వ‌ర్క్ ఓ రేంజులో ఉంటుంద‌న్న విష‌యం... ట్రైల‌ర్ చూస్తేనే అర్థ‌మైపోతోంది. అయితే విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, సీజీ వ‌ర్క్‌కి కొంతకాలం దూరంగా ఉండాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నాడ‌ట‌.

త‌న త‌దుప‌రి క‌థ‌ల్లో సీజీ వ‌ర్క్‌కి ప్రాధాన్యం లేనివే ఎంచుకొంటాన‌ని క‌నీసం రెండు మూడు సినిమాల వ‌ర‌కూ విఎఫ్ఎక్స్‌కి దూరంగా ఉంటాన‌ని అంటున్నాడు రాజ‌మౌళి. రాజ‌మౌళి సినిమా అంటేనే ఓ విజువ‌ల్ వండ‌ర్ అనే అభిప్రాయానికి వ‌చ్చేశారు తెలుగు ప్రేక్ష‌కులు. అయితే ఆ ముద్ర నుంచి బ‌య‌ట ప‌డ‌డానికి రాజ‌మౌళి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. క‌నీసం మ‌హాభార‌తం వ‌ర‌కైనా స‌రే.. సీజీకి దూరంగా ఉండాల‌ని రాజ‌మౌళి నిర్ణ‌యించుకొన్నాడు. అంటే.. రాజ‌మౌళి త‌దుప‌రి సినిమా క‌చ్చితంగా ఛ‌త్ర‌ప‌తిలాంటి మాస్ మ‌సాలా అయ్యింటుంది. నో డౌట్! మ‌రి ఆ క‌థ మ‌హేష్ బాబు కోస‌మేనా? లేదంటే మ‌రో హీరోతో రాజ‌మౌళి ప్ర‌యాణం చేస్తారా అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాలి.