English | Telugu

రాజ‌మౌళికి ఆ కోపం ఇంకా ఉంది!

బాహుబ‌లి - ది బిగినింగ్ చూసి సినీ ప్ర‌పంచం నివ్వెర పోయింది. రికార్డులు దాసోహ‌మ‌న్నాయి. అవార్డులు - రివార్డులు వ‌రుస క‌ట్టాయి. కానీ.. అప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాని మోసిన మీడియా ముఖ్యంగా వెబ్ మీడియా మాత్రం కాస్త నెగిటీవ్ రివ్యూలే రాసింది. బాగుంది అని చెప్పినా... ఆశించిన స్థాయిలో లేదంటూ విమ‌ర్శించింది. బాహుబ‌లికి జాతీయ అవార్డు వ‌చ్చిన‌ప్పుడు కూడా వ‌ద‌ల్లేదు. స‌గం సినిమాకి జాతీయ అవార్డు రావ‌డం ఏమిటి? అంటూ కౌంట‌ర్లు వేసింది. ఆ కోపం రాజ‌మౌళికి ఇంకా ఉన్న‌ట్టుంది. అందుకే.. మీడియాపై త‌న కోపాన్ని సున్నితంగానే వెళ్ల‌గక్కాడు.

మీడియానే త‌మ సినిమాకి హైప్ తీసుకొచ్చింద‌ని, సినిమాని ఎక్క‌డికో తీసుకెళ్లింద‌ని, బాగున్న‌ప్పుడు పొగ‌డ్డం.. బాలేన‌ప్పుడు విమ‌ర్శించ‌డం మీడియాకు మామూలే అని బాహుబ‌లి విష‌యంలో మీడియా పాత్ర గురించి చెబుతూ...వివ‌రించాడు రాజ‌మౌళి. సినిమాలో ప‌నిచేసిన వ్య‌క్తుల గురించి విమ‌ర్శించినా.. సినిమాని మాత్రం మీడియా మోసింద‌ని రాజ‌మౌళి గుర్తు చేశాడు జ‌క్క‌న్న‌! బాహుబ‌లి 2 విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతోంది క‌దా. అందుకే రాజ‌మౌళి మీడియాని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం మొద‌లెట్టాడు. అందుకే.. బాహుబ‌లి రివ్యూల విష‌యంలో ఎంత కోపంగా ఉన్నా... స‌హ‌నం ప్ర‌ద‌ర్శించాల్సి వ‌స్తోంది. మ‌రి బాహుబ‌లి 2 మీద ఎలాంటి రివ్యూలు వ‌స్తాయో చూడాలి.