English | Telugu

ఇళయరాజా, బాలు గొడవకు కారణం ఏంటి..?

పాటలు పాడే వ్యక్తికి, పాటలకు స్వరాలు సమకూర్చే వ్యక్తికి మధ్య ఊహించని యుద్దం మొదలైంది. దశాబ్ధాల తరబడి సినీ సంగీత ప్రియులను రంజింపచేసిన వారిద్దరి మధ్య ఇప్పుడు జగడం వచ్చింది. వారు ఎవరో కాదు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, మేస్ట్రో ఇళయరాజా. ఈ మధ్య పాటలు పాడటం దాదాపుగా తగ్గించేసిన బాలు విదేశాల్లో కచేరీలు నిర్వహిస్తున్నారు. తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్లు పాడిన బాలు వాటిలోంచి కొన్నింటిని ఆ కచేరీల్లో పాడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఎస్పీబీ ఎక్కువగా తన పాటలే పాడుతున్నారంటూ..అలా ఇంకెప్పుడూ తన పాటలు పాడకూడదంటూ ఇళయరాజా, బాలుకి లీగల్ నోటీసులు పంపారు.

ఆయనతో పాటు సింగర్స్ చిత్ర, ఎస్పీ చరణ్‌, ఈవెంట్ ఆర్గనైజర్లకు కూడా నోటీసులు పంపారు రాజా..దీనిపై బాలు స్పందిస్తూ తన కొడుకు ఈ వరల్డ్ టూర్‌ని ప్లాన్ చేశాడని..ఎస్పీబీ 50 పేరుతో టొరంటో, రష్యా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, దుబాయ్‌తో పాటు ఇండియాలోని పలు ప్రాంతాల్లో విజయవంతంగా కచేరీలు నిర్వహించామన్నారు. అయితే ఆ సమయంలో ఇళయరాజా నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని కాని అమెరికా టూర్‌లో ఉన్నప్పుడు మాత్రమే రాజా ఎందుకిలా స్పందించారో అంటూ ఫేస్‌బుక్‌లో కామెంట్ చేశారు. ఇక నుంచి తన ట్రూప్ ఇళయరాజా పాటలు పాడదని స్పష్టం చేశారు. అయితే అమెరికాలో నిర్వహించే కచేరికి ఇళయరాజాకు ఆహ్వానం రానందుకే ఆయన తన అక్కసును ఇలా తీర్చుకుంటున్నారని కోలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఇద్దరు దిగ్గజాల మధ్య వివాదం త్వరగా ముగిసిపోవాలని కోరుకుందాం.