English | Telugu
చిరుని ఉరి తీస్తారు.. జనం చూస్తారా?
Updated : Mar 20, 2017
యాంటీ క్లైమాక్స్ అంటే తెలుగు వాళ్లకు ఏమాత్రం నచ్చదు. సినిమా ఎలాంటిదైనా సరే.. చివర్లో శుభం కార్డు పడాల్సిందే. హీరో, హీరోయిన్లు తమ ఫ్యామిలీతో సహా హ్యాపీగా ఫొటోలకు ఫోజులు ఇవ్వాల్సిందే. స్టార్ హీరోల సినిమా.. యాంటీ క్లైమాక్స్‌తో ముగిసిందంటే.. ఇక ఆ సినిమా ఆడినట్టే! రీమేక్ కథలు చేసేటప్పుడు కూడా.. పరాయి భాషలో యాంటీ క్లైమాక్స్ ఉంటే... దాన్ని హ్యాపీ క్లైమాక్స్ గా మార్చుకొంటుంటారు దర్శకులు. తమిళ రమణ విషయంలో అదే జరిగింది. ఆ సినిమాలో హీరో చనిపోతాడు. తెలుగులో ఠాగూర్‌గా రీమేక్ చేసినప్పుడు ఆ క్లైమాక్స్‌ని మార్చేశాడు వినాయక్. ఎందుకంటే చిరంజీవి చనిపోతే ఆయన అభిమానులు జీర్ణించుకోలేరని.
అయితే ఇప్పుడు చిరు చేయబోయే 151వ సినిమా యాంటీ క్లైమాక్స్ కనిపించబోతోంది. చిరు తన 151వ చిత్రంగా ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని సినిమాగా తీయాలనుకొంటున్న సంగతి తెలిసిందే. అదో యోధుడి కథ. బ్రిటీష్ వారిపై పోరాటం సాగించిన తొలి.. స్వాతంత్య్ర సమరయోధుడి జీవితం. అయితే కథ ప్రకారం ఉయ్యాల వాడ నరసింహారెడ్డి బ్రిటీష్ వారిపై పోరాటం చేసి, చివరి వారి చేతుల్లోనే చిక్కి ఉరికంబానికి ఎక్కాడు. బ్రిటీష్ వారి చేతుల్లో వీరమరణం పొందాడు.
సినిమా లెక్కల ప్రకారమో, ఇమేజ్ ప్రకారమో చరిత్రని మార్చడానికి లేదు. ఉన్నది ఉన్నట్టుగా తీయాల్సిందే. అలా తీస్తే...చిరుని కూడా ఉరికంబానికి ఎక్కించాలి. ఇలా తీస్తే జనం చూస్తారా? అనే సందేహాలు నెలకొనడం సహజం. లేదా అభిమానుల కోసం క్లైమాక్స్‌ని మారిస్తే చరిత్రని వక్రీకరించినట్టు అవుతుంది. చిరంజీవి మాత్రం యాంటీ క్లైమాక్స్ నే కోరుకొంటున్నాడట. ఓ విధంగా చెప్పాలంటే చిరు ప్రయోగం చేస్తున్నట్టే లెక్క. ఫార్ములాల్ని పక్కన పెట్టి చిరు... వైవిధ్యాన్ని కోరుకోవడం నిజంగా అభినందించదగిన విషయమే. మరి చిరు ఫ్యాన్స్ మాత్రం ఈ క్లైమాక్స్‌ని ఎలా స్వీకరిస్తారో చూడాలి.