English | Telugu

వెంకీ సినిమా శ‌ర్వా చేతికి?

వెంక‌టేశ్ చేయాల్సిన సినిమా శ‌ర్వానంద్ చేయ‌నున్నాడా? ఇప్పుడు ఫిల్మ్‌న‌గ‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న ఆస‌క్తిక‌ర విష‌యాల్లో ఇదొక‌టి. వెంక‌టేశ్ ప్ర‌స్తుతం 'అసుర‌న్' రీమేక్ 'నార‌ప్ప' సినిమా చేస్తున్నారు. క‌రోనా దెబ్బ కొట్ట‌క‌పోతే ఈ స‌రికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేయాల్సిన ఈ చిత్రం అనివార్యంగా వాయిదా ప‌డింది. షూటింగ్ పున‌రుద్ధ‌రించ‌గానే వీలైంత త్వ‌ర‌గా స‌న్నివేశాలు షూట్ చేసి, ఈ ఏడాదిలోనే సినిమాని రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు డి. సురేశ్‌బాబు, క‌లైపులి ఎస్‌. థాను భావిస్తున్నారు. ఈ మూవీని శ్రీ‌కాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇది పూర్త‌యిన వెంట‌నే అనిల్ రావిపూడి సినిమా 'ఎఫ్‌3'ని స్టార్ట్ చెయ్య‌డానికి సిద్ధంగా ఉన్నారు వెంక‌టేశ్‌. ఇప్ప‌టికే త‌రుణ్ భాస్క‌ర్ స్క్రిప్ట్‌కు ఓకే చెప్పినంద‌న, 'ఎఫ్‌3'తో పాటు ఆ సినిమానీ ఆయ‌న చేయ‌వ‌చ్చు. అయితే చాలా రోజుల క్రిత‌మే వెంకీకి డైరెక్ట‌ర్ కిశోర్ తిరుమ‌ల 'ఆడవాళ్లూ మీకు జోహార్లు' అనే స్క్రిప్ట్‌ను వినిపించాడు. దానిపై వెంకీ ఇంత‌వ‌ర‌కూ త‌న నిర్ణ‌యాన్ని చెప్ప‌లేదంటున్నారు.

కిశోర్ ప్ర‌స్తుతం రామ్‌తో 'రెడ్' మూవీని చేస్తున్నాడు. ఆ సినిమా కూడా రిలీజ్‌కు రెడీగా ఉంది. అది రిలీజ‌వ‌గానే 'ఆడవాళ్లూ మీకు జోహార్'లు స్క్రిప్టును తెర‌కెక్కించాల‌ని అత‌ను త‌ప‌న ప‌డుతున్నాడు. వెంకీ నుంచి ఎలాంటి స‌మాధాన‌మూ రాక‌పోవ‌డంతో చాలా కాలంగా వేచి ఉన్న అత‌ను లాభం లేద‌ని ఆ స్క్రిప్టును శ‌ర్వానంద్‌కు వినిపించాడ‌నీ, విన్న వెంట‌నే శ‌ర్వా దానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌నీ ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చెప్పుకుంటున్నారు. సో.. ఒక‌సారి టాలీవుడ్‌లో షూటింగ్‌లు పున‌రుధ్ధ‌రించ‌గానే.. 'ఆడ‌వాళ్లూ మీకు జోహార్లు' సెట్స్ మీద‌కు వెళ్ల‌డం ఖాయ‌మేన‌నిపిస్తోంది.