English | Telugu

సాయిధరమ్ తేజ్ ఒక మంచి బ్యాడ్ సన్!

"శ్రీమంతుడు" సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. "ఏ ఎదవ పని చేసినా ఆడ్ని కాపాడడానికి వాడి వెనకాల ఓ బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పాడట, మా ఫ్యామాలీని కాపాడడానికి కూడా నాలాంటి బ్యాడ్ సన్ ఒకడున్నాడు. బ్యాడ్ అంటే నీలా కాదు అదో రకం" అని మహేష్ బాబు చాలా సైలెంట్ గా విలన్ కి మాంచి వార్నింగ్ ఇస్తాడు. మొన్న జరిగిన "తిక్క" ఆడియో వేడుకలో మెగా అభిమానులందరికీ సాయిధరమ్ తేజ్ మాంచి "బ్యాడ్ సన్"లా కనిపించాడు.

"సరైనోడు" సక్సెస్ మీట్ అల్లు అర్జున్ అన్న #చెప్పనుబ్రదర్ ఎంత హడావుడి చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడే అందరూ ఆ విషయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ.. ఇటీవల జరిగిన "తిక్క" ఆడియో వేడుకలో #ఆపలేనుబ్రదర్ #అరవండిబ్రదర్ అంటూ పాత పుండుపై కారం జల్లడంతోపాటు.. మెగా అభిమానులందర్నీ తనవైపుకు తిప్పుకొన్నాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ కు విబేధాలొచ్చాయని అందుకే అలా అన్నాడని అప్పట్లో కొన్ని కథనాలొచ్చాయి. కానీ.. ఆ కథనాల్లో ఎటువంటి నిజం లేదని అర్జున్ బుకాయించడానికి ప్రయత్నించాడు. అల్లు అర్జున్ ను టార్గెట్ చేశాడో లేక ఫ్లోలో అనేశాడే తెలియదు కానీ.. సాయిధరమ్ తేజ్ మాత్రం ప్రస్తుతం మెగా అభిమానులకు "హాట్ ఫ్యావరెట్" అయిపోయాడు!