English | Telugu

శిరీష్ బాబూ.. ఇదేం స్పీచ్ బాబూ!

మెగా హీరోల్లో అంద‌రూ మంచి `మాట‌`గాళ్లే. చిరు మాట్లాడుతుంటే ఆ స్పీచ్ ఎలాగున్నా స‌రే, ఫ్యాన్స్‌కి మాత్రం బాగుంటుంది. ప‌వ‌న్ మైకు ప‌ట్టుకొంటే ఆయ‌న‌కెలా ఉన్నా, ఫ్యాన్స్‌కి పూన‌కం వ‌చ్చేస్తుంది. బ‌న్నీ అయితే... స్క్రిప్టు రాసుకొచ్చి చ‌దువుతున్న‌ట్టు అక్ష‌రం పొల్లుపోకుండా మాట్లాడేస్తుంటాడు. రామ్‌చ‌ర‌ణ్ కూడా డిట్టో అంతే. సాయిధ‌ర‌మ్ తేజ్ ఎంత‌టి మాట‌గాడో... తిక్క ఆడియో ఫంక్ష‌న్‌లో అర్థ‌మైంది. అంతా ఓకే. కానీ శిరీష్ బాబు మాట‌ల్లోనూ జీరోనేమో అనిపిస్తోంది. శ్రీ‌ర‌స్తు - శుభ‌మ‌స్తు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో బాబుగారి స్పీచ్ చుస్తుంటే ఇత‌గాడికి ఇందులోనూ క‌ఠోర‌మైన శిక్ష‌ణ ఇవ్వాలేమో అనిపిస్తోంది. మాట‌ల్లో అంద‌రు హీరోల్లానే చిరు స్త్రోత్రం చేసుకొచ్చాడీయ‌న‌. ఎప్ప‌టెప్ప‌టి విష‌యాలో గుర్తు చేసి బోర్ కొట్టించాడు.

`ఫ్యాన్స్ అడిగితే ఫొటోలు ఇవ్వ‌డానికి ఇబ్బంది ప‌డొద్దు...` అని చిరు చెప్పార‌ట‌. బాగానే ఉంది. శిరీష్ కూడా అస‌లు ఏమాత్రం విసుగు చూపించ‌కుండా ఫ్యాన్స్‌కి ఫొటోల మీద ఫొటోలు ఇస్తుంటాడట‌. ఈయ‌న గారు చేసిందే రెండు సినిమాలు. అందులో ఒక‌టి అట్ట‌ర్ ఫ్లాప్‌. అయినా కూడా త‌న‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంద‌ని ఎలా న‌మ్ముతున్నాడో ఏంటో?? చిరు మాట‌ల వ‌ల్ల తాను చాలా మారాడ‌ట‌. త‌న స్టాఫ్‌ని ఎంతో గౌర‌విస్తున్నాడ‌ట‌. ఈ స్పీచ్ విని వాళ్లెంత కుళ్లి కుళ్లి న‌వ్వుకొన్నారో? శిరీష్ స్పీచ్ సుదీర్ఘంగా సాగింది. అందులో త‌డ‌బ‌డిన సంద‌ర్భాలే ఎక్కువ‌. మొన్నామ‌ధ్య ఓ అవార్డు ఫంక్ష‌న్‌లో యాంక‌రింగు కూడా చేసేసిన శిరీష్‌కి సినిమాటిక్ లాంగ్వేజ్ అల‌వాటు కావ‌డానికి ఇంకా టైమ్ ప‌ట్టేట్టే ఉంది.