English | Telugu

రోబో 2కి 110 కోట్లా..? ఇంత కంటే పెద్ద జోక్ లేదు!

రోబో 2 శాటిలైట్ హ‌క్కుల్ని రూ.110 కోట్ల‌కు ఓ ఛాన‌ల్ కొనుగోలు చేసింద‌న్న వార్త యావ‌త్ చిత్ర ప్ర‌పంచాన్ని నివ్వెర ప‌రుస్తోంది. ద‌క్షిణాది సినిమా కాల‌ర్ ఎగ‌రేయాల్సిన స‌మ‌యం ఇది. ఎందుకంటే ఎప్పుడూ వినని చూడ‌ని ధ‌ర ఇది. ర‌జ‌నీకాంత్ స్టామినాకి నిద‌ర్శ‌నం ఇది. అయితే.. ఈ అంకెల్లో నిజం ఉందా?? లేదంటే ర‌జ‌నీ అండ్ టీమ్ మ‌సిపూసి మారేడు కాయ చేస్తోందా?? అనేదే అర్థం కావ‌డం లేదు.

110 కోట్లంటే చిన్న విష‌యం కాదు. రోబో 2 బ‌డ్జెట్‌లో స‌గం రాబ‌ట్టేసిన‌ట్టే. త‌మిళంలో ర‌జ‌నీకాంత్ కి ఉన్న క్రేజ్ చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అక్క‌డి శాటిలైట్ దాదాపుగా రూ.40 కోట్లు ప‌లికినా ఆశ్చ‌ర్య పోన‌వ‌స‌రం లేదు. మ‌హా అయితే రూ.50 కోట్లు అనుకొందాం. తెలుగు, హిందీకి మ‌రో రూ.60 కోట్లు ద‌క్కాయా?? అంత‌సీన్ ఉందా?? తెలుగులో మ‌హేష్, ప‌వ‌న్ లాంటి సూప‌ర్ స్టార్ సినిమాల‌కే రూ.12 కోట్లు మించి రావ‌డం లేదు. బాహుబ‌లికే ఇక్క‌డ రూ.15 కోట్లు వ‌చ్చింది.

ర‌జ‌నీకాంత్ సినిమాని అంత‌కంటే ఎక్కువ పెట్టి ఎవ్వ‌రూ కొన‌రు. ఎంత అక్షయ్ కుమార్ ఉన్నా... ఈ సినిమాని ఓ డ‌బ్బింగ్ సినిమాల‌నే భావిస్తోంది బాలీవుడ్‌. ఓ డ‌బ్బింగ్ సినిమా శాటిలైట్ హ‌క్కుల్ని రూ.50 కోట్లు పెట్టి కొంటుందా?? అంత సీన్‌లేదాయె. అక్క‌డ షారుఖ్ సినిమాలే రూ.70 కోట్లు దాట‌లేదెప్పుడు. చూస్తుంటే కేవ‌లం త‌మ సినిమా ప‌బ్లిసిటీ పెంచుకోవ‌డానికి, హైప్ తీసుకురావ‌డానికి శంక‌ర్ అండ్ టీమ్ చేస్తున్న జిమ్మిక్‌లా ఉందంతే. ఈ అంకెల్లో నిజం లేద‌న్న‌ది సినీ వర్గాల విశ్లేష‌ణ‌. మ‌రి రోబో నిర్మాత‌లు ఏమంటారో చూడాలి.