English | Telugu

ఐదు సార్లు అడ్డంగా బుక్క‌యిపోయిన చ‌ర‌ణ్‌

సినిమాల్లో హీరోలు కాస్త బ‌య‌ట జీరోలుగా మారిపోతుంటారు. అందుకు తాజాగా ఉదాహ‌ర‌ణ రామ్ చ‌ర‌ణ్. ఈ మెగా హీరోకి సంబంధించిన ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. చ‌ర‌ణ్ కి టీఎస్ 09 ఈఎస్ 2727 నెంబ‌రు గ‌ల రేంజ్ రోవ‌ర్ కారుంది. ఈ కారు ఇప్ప‌టి వ‌ర‌కూ 5 సార్లు ట్రాఫిక్స్ నిబంధ‌నల్ని ఉల్లంఘించింద‌ని రికార్డులు చెబుతున్నాయి. ఈ కారుపై 5 సార్లు చ‌లానా విధించార‌ట‌. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క‌సారి కూడా చ‌లానా చెల్లించ‌లేద‌ట‌.

ఇటీవ‌ల ఈ కారుతో చిరు, చ‌ర‌ణ్‌లు ఇద్ద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ కారు నెంబ‌ర్ చూసి.. ఆరా తీస్తే ఈ రికార్డులు బ‌య‌ట‌ప‌డ్డాయి. నో పార్కింగ్ జోన్‌లో కారు పార్క్ చేసినందుకు, అవుట‌ర్ రింగ్ రోడ్డులో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా కారుని మితిమీరిన వేగంతో న‌డిపినందుకు చ‌లానాలు విధించార్ట‌. అయితే ఆ స‌మ‌యంలో చ‌ర‌ణ్ కారు న‌డుపుతున్నాడా, లేదంటే డ్రైవ‌ర్ ఉన్నాడా అనేది తెలియ‌డం లేదు. మొత్తానికి చ‌ర‌ణ్ కారు మాత్రం వార్త‌ల్లో నిలిచిందిప్పుడు. ఓ సెల‌బ్రెటీ అయ్యుండి.. ఇలాంటి విష‌యాల్లో జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే ఎలా?? చ‌ర‌ణ్‌.. ఇప్ప‌టికైనా కాస్త ట్రాఫిక్ రూల్స్‌ని పాటించ‌మ్మా.