English | Telugu
ఇప్పటివరకు టచ్ చేయని జోనర్‌లో రవితేజ కొత్త సినిమా?
Updated : Oct 5, 2024
తన కెరీర్‌లో ఎక్కువ మాస్ సినిమాలే చెయ్యడం వల్ల రవితేజకు మాస్‌రాజా అనే బిరుదును తగిలించారు. ఫ్యామిలీ, సెంటిమెంట్, లవ్, క్రైమ్, కామెడీ వంటి జోనర్స్‌లో ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులకు బాగా దగ్గరైన రవితేజ.. ఇప్పటివరకు హారర్ జోనర్‌లో సినిమా చెయ్యలేదు. ఒకవిధంగా ఆ జోనర్‌లో అతను సెట్ అవ్వడు కూడా. ఎందుకంటే.. ఎప్పుడూ కేర్‌లెస్‌గా, ఒక డిఫరెంట్ యాటిట్యూడ్‌తో ఉండే పాత్రల్లోనే అతన్ని చూశాం. హారర్ సినిమా అంటే కొన్ని సన్నివేశాల్లో భయపడుతున్నట్టుగా కనిపించాలి. ఇప్పటివరకు రవితేజను ఒక తరహా పాత్రల్లో చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులు హారర్ జోనర్‌లో సినిమా చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? ఈ సందేహాన్ని తీర్చుకునేందుకు ఇప్పుడు రవితేజ ఒక హారర్ సినిమాలో నటించబోతున్నాడన్న వార్త ప్రచారంలోకి వచ్చింది.
భాను భోగవరపు సినిమా పూర్తయిన తర్వాత రవితేజ ఓ హారర్ సినిమా చేయబోతున్నారని సమాచారం. తమిళ్ డైరెక్టర్ సుందర్ సి. కాంబినేషన్‌లో ఓ సినిమా చేసేందుకు రవితేజ సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. హారర్ సినిమాలు రూపొందించడంలో సుందర్ దిట్ట. తమిళ్‌లో అరణ్మనై సిరీస్‌లో నాలుగు సూపర్‌హిట్ సినిమాలు చేశారు. అవి తెలుగులో చంద్రకళ, కళావతి, అంత:పురం పేర్లతో తెలుగులో వచ్చాయి. రవితేజ ఇమేజ్‌కి సరిపోయే కథ సుందర్ దగ్గర ఉందట. త్వరలోనే రవితేజకు నేరేషన్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మించే అవకాశం ఉందట. రవితేజ చేయనున్న 76వ సినిమా కూడా ఇదే అని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్సే ఎక్కువ చేసిన రవితేజకు సుందర్‌తో చేయబోయే సినిమా ఓ కొత్త జోనర్ అవుతుంది. మరి రవితేజను సుందర్‌ని ఎలా చూపిస్తారో చూడాలి.