English | Telugu

ర‌ష్మిక చేతిలో కొత్త సినిమాలు లేక‌పోవ‌డానికి కార‌ణం?

2020లో 'స‌రిలేరు నీకెవ్వ‌రు' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌, 'భీష్మ' వంటి హిట్ కొట్టి ఆడియెన్స్‌లో త‌న క్రేజ్‌ను మ‌రింత పెంచుకుంది క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మికా మంద‌న్న‌. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా ఆమె తెలుగులో కొత్త‌గా ఏ సినిమాకూ క‌మిట్ కాక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. ఆమె చేతిలో ప్ర‌స్తుతం ఒకే ఒక సినిమా ఉంది. అది.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ర‌ష్మిక పాత్ర బాగా ఆక‌ట్టుకుంటుంద‌ని ఆ స్క్రిప్ట్ గురించి తెలిసిన‌వాళ్లు చెప్తున్న మాట‌. లారీ డ్రైవ‌ర్‌గా న‌టిస్తోన్న బ‌న్నీని ఇష్ట‌ప‌డే గ్రామీణ యువ‌తి పాత్ర‌లో ఆమె క‌నిపించ‌నున్న‌ది.

అయితే ఇప్ప‌టిదాకా ఆ సినిమా షూటింగ్ మొద‌లు కానే లేదు. కేర‌ళ‌లో వారం రోజుల పాటు తీసిన స‌న్నివేశాల‌ను సినిమాలో వాడ‌ర‌నీ, కేవ‌లం అవి శాంపిల్ సీన్లేన‌నీ వెల్ల‌డైంది. తెలుగు ప్రేక్ష‌కుల‌లో త‌న‌కు అభిమాన గ‌ణం త‌యార‌వ‌డం, వ‌రుస విజ‌యాలు రావ‌డంతో ర‌ష్మిక పారితోషికం పెంచేసింద‌నీ, ఇది నిర్మాత‌ల‌ను షాక్‌కు గురిచేసింద‌నీ ఫిల్మ్‌న‌గ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నిజానికి జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో త్రివిక్ర‌మ్ రూపొందించ‌నున్న సినిమాలో హీరోయిన్‌గా ర‌ష్మిక పేరు కూడా ప‌రిశీల‌న‌లో ఉంది. కానీ రూ. కోటి పైగా రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేయ‌డంతో త్రివిక్ర‌మ్‌ ఆమెను ప‌క్క‌న పెట్టార‌నే మాట వినిపిస్తోంది.

త‌మిళంలో కార్తీ జోడీగా ఆమె న‌టించిన 'సుల్తాన్' మూవీ, క‌న్న‌డంలో ధ్రువ స‌ర్జా స‌ర‌స‌న న‌టించిన 'పొగ‌రు' సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్నాయి. ఆ భాషల్లోనూ కొత్త‌గా ఆమె సినిమాలు ఒప్పుకున్న దాఖ‌లాలు లేవు.