English | Telugu

బాల‌కృష్ణ‌, రానా మ‌ల్టీస్టార‌ర్‌!

టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ సినిమాల నిర్మాణం ఊపందుకుంటోంది. కొన్నేళ్ల క్రితం మ‌ల్టీస్టార‌ర్ మూవీ అనేది తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓ ఊహ‌గానే ఉంటూ వ‌చ్చింది. ఎప్పుడైతే వెంక‌టేశ్‌, మ‌హేశ్ క‌లిసి 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' మూవీ చేశారో.. ఆ త‌ర్వాత నుంచి ఒక్క‌టొక్క‌టిగా మ‌ల్టీస్టార‌ర్‌లు తెలుగులో నిర్మాణ‌మ‌వుతూ వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం దేశ‌మంతా అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తోన్న ట్రిపుల్ ఆర్ మూవీ నిర్మాణంలో ఉన్న విష‌యం తెలిసిందే. 2021 జ‌న‌వ‌రి 8న ఆ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది.

తాజాగా మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఆజానుబాహుడు రానా ద‌గ్గుబాటి క‌లిసి ఓ సినిమా చేసేందుకు అంగీక‌రించిన‌ట్లు ఫిల్మ్ న‌గ‌ర్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌ల‌యాళ బ్లాక్‌బస్ట‌ర్ 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్' సినిమా తెలుగు రీమేక్ హ‌క్కుల్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధినేత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ కొనుగోలు చేశారు. 'ప్రేమ‌మ్'‌, 'జెర్సీ', 'భీష్మ' సినిమాల‌తో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌గా పేరు తెచ్చుకున్న ఈ సంస్థ ఇప్పుడు 'అయ్య‌ప్ప‌నుమ్' కోషియుమ్ రీమేక్ కోసం మొద‌ట‌గా ఒరిజిన‌ల్‌లో బిజూ మీన‌న్ చేసిన పాత్ర కోసం బాల‌కృష్ణ‌ను సంప్ర‌దించ‌గా ఆయ‌న ఓకే చెప్పాడు.

ఇద్ద‌రు హీరోల ఈ సినిమాలో మ‌రో హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ పోషించిన‌ క్యారెక్ట‌ర్ చేయ‌డానికి తాజాగా రానా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. వాస్త‌వానికి మొద‌ట ఆ పాత్ర కోసం మంచు మ‌నోజ్ పేరు ప‌రిశీల‌న‌కు వ‌చ్చిన‌ట్లు వినికిడి. త‌ర్వాత ఎందుక‌నో నిర్మాత‌లు రానాను ఎంచుకున్నారు. 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్' అనే మూవీ అయ్య‌ప్ప‌న్ నాయ‌ర్ అనే పోలీస్ ఆఫీస‌ర్‌, రిటైర్డ్ ఆర్మీ హ‌వ‌ల్దార్ కోషి కురియెన్ మ‌ధ్య ఈగో క్లాషెస్ వ‌ల్ల ఎలాంటి ప‌రిణామాలు ఉత్ప‌న్న‌మ‌య్యాయ‌నే అంశంతో న‌డుస్తుంది. అయ్య‌ప్ప‌న్ పాత్ర‌ను బిజూ, కోషి క్యారెక్ట‌ర్‌ను పృథ్వీరాజ్ చేశారు.

క‌రోనా గొడ‌వ స‌ద్దుమ‌ణిగాక ఈ సినిమాకు సంబంధించి నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇదివ‌ర‌కు ఎన్టీ రామారావు బ‌యోపిక్‌లో బాల‌కృష్ణ‌, రానా క‌లిసి న‌టించారు.