English | Telugu

తార‌క్ జోడీగా జాన్వి?

య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న 'రౌద్రం ర‌ణం రుధిరం' (ఆర్ఆర్ఆర్‌) మూవీలో కొమ‌రం భీమ్ పాత్ర చేస్తున్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. దాని త‌ర్వాత త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో న‌టించేందుకు అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. ట్రిపుల్ ఆర్ షూటింగ్ పూర్త‌య్యాక త్రివిక్ర‌మ్ మూవీని అత‌ను ప్రారంభించ‌నున్నాడు. కాగా ఈ సినిమాలో నాయిక‌గా ఒక‌రి త‌ర్వాత ఒక‌రి పేర్లు వినిపిస్తున్నాయి.

నిన్న‌టి దాకా స‌మంత‌, ర‌ష్మికా మంద‌న్న పేర్లు గ‌ట్టిగా వినిపించ‌గా, తాజాగా పూజా హెగ్డే, జాన్వీ క‌పూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటార‌నీ మొద‌ట్నించీ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఓ నాయిక‌గా పూజా పేరు ఇప్ప‌టికే ఖ‌రార‌య్యింద‌నీ, మ‌రో నాయిక‌గా జాన్వీని సంప్ర‌దిస్తున్నార‌నేది ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. శ్రీ‌దేవి కూతురిగా ఇప్ప‌టికే లైమ్‌లైట్‌లోకి వ‌చ్చిన జాన్వి.. బాలీవుడ్‌లో 'ధ‌డ‌క్' (2018) మూవీతో ఎంట్రీ ఇచ్చి ఆక‌ట్టుకుంది. ఆమె చేతిలో ప్ర‌స్తుతం మూడు సినిమాలున్నాయి. వాటిలో రెండు సినిమాలు.. 'గుంజ‌న్ స‌క్సేనా', 'రూహి అఫ్జానా' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా, 'దోస్తానా 2' సెట్స్‌పై ఉంది.

త‌న త‌ల్లి శ్రీ‌దేవిని మొద‌ట స్టార్‌ని చేసిన ద‌క్షిణాది సినిమాల్లో న‌టించాల‌ని ఉంద‌నే ఆకాంక్ష‌ను గ‌తంలోనే వ్య‌క్తం చేసిన జాన్వి.. ఇప్పుడు త్రివిక్ర‌మ్‌-తార‌క్ సినిమా ఆఫ‌ర్‌ను అంగీక‌రిస్తుందా, లేదా అనేది ఆస‌క్తిక‌రం. గ‌తంలోనూ ఆమెకు టాలీవుడ్ నుంచి ఆఫ‌ర్లు వ‌చ్చినా అవేవీ వాస్త‌వ‌రూపం దాల్చ‌లేదు. ఒక‌వేళ తార‌క్ జోడీగా జాన్వి న‌టించ‌డం ఖ‌రారైతే, ఇటు నంద‌మూరి అభిమానులు, అటు శ్రీ‌దేవి అభిమానులూ సంతోష‌ప‌డ‌తార‌న‌డంలో సందేహం లేదు.