English | Telugu

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌తో 1000 కోట్ల తెలుగు దర్శకుడి సినిమా?

తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌కి తెలుగులోనూ అదే స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఒక దశలో తమిళ్‌లోనే రజినీకి ఎక్కువ మార్కెట్‌ ఉండేది. ‘బాషా’ తర్వాత లెక్కలు పూర్తిగా మారిపోయాయి. తెలుగులోనూ ఆయనకు భారీ మార్కెట్‌ వచ్చేసింది. దాంతో అప్పటి నుంచి రజినీకాంత్‌ చేసే ప్రతి సినిమా తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఇటీవల విడుదలైన ‘కూలీ’ చిత్రానికి డివైడ్‌ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మంచి టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న మాటేమిటంటే.. ఓ తెలుగు దర్శకుడితో రజినీకాంత్‌ సినిమా చేయబోతున్నాడని. ఇంతకీ ఎవరా దర్శకుడు? ఈ కాంబినేషన్‌ ఎలా సెట్‌ అయింది? సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న వార్తలో ఎంతవరకు నిజం ఉంది? అనే విషయాలు తెలుసుకుందాం.

తమిళ్‌లో కె.బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన రజినీకాంత్‌.. ఆ సినిమా తర్వాత పుట్టన్న కనగళ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కథా సంగమ’ చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచమయ్యారు. అదే సంవత్సరం కె.బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అంతులేని కథ’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. ఇలా తన తొలి మూడు సినిమాలతో మూడు భాషల్లో నటుడిగా పరిచయమయ్యారు రజినీకాంత్‌. ఆ తర్వాత తెలుగులో ఈరంకి శర్మ దర్శకత్వంలో వచ్చిన ‘చిలకమ్మ చెప్పింది’ చిత్రంలో హీరోగా నటించారు. రజినీకాంత్‌ తెలుగు దర్శకులతో కలిసి పనిచేసిన సందర్భాలు చాలా తక్కువ. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘పెదరాయుడు’ తెలుగు దర్శకుడితో ఆయన చేసిన చివరి సినిమా.

దాదాపు 30 సంవత్సరాల తర్వాత రజినీకాంత్‌ ఒక తెలుగు దర్శకుడి సినిమాలో నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు, నాగ్‌ అశ్విన్‌. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో అతను చేసిన ‘కల్కి 2898ఎడి’ 1000 కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌ కూడా ప్లాన్‌ చేశారు. అయితే ప్రభాస్‌ ఇతర ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉండడంతో నాగ్‌ అశ్విన్‌కు టైమ్‌ దొరికింది. ఈ గ్యాప్‌లో ఒక సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. రజినీకాంత్‌కి నాగ్‌ ఒక కథ చెప్పడం, అది ఓకే అవ్వడం కూడా జరిగిపోయిందని తెలుస్తోంది.

ఈ కాంబినేషన్‌ సెట్‌ చేయడంలో అశ్వినీదత్‌ కీలక పాత్ర పోషించారని సమాచారం. చేసిన మూడు సినిమాలు సూపర్‌హిట్‌ అవ్వడంతో ఏకంగా రజినీకాంత్‌నే డైరెక్ట్‌ చేసే అవకాశం అల్లుడికి అశ్వినీదత్‌ కల్పించారని సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ పెడుతున్నారు. నాగ్‌అశ్విన్‌కి నిజంగా ఇది మంచి అవకాశం అని చెప్పాలి. అపజయం లేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నాగ్‌.. రజినీకాంత్‌తో చేయబోయే సినిమా ఎలా ఉంటుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఈ వార్తలో నిజమెంత అనేది పక్కన పెడితే.. తప్పకుండా ఇది ఒక గొప్ప ప్రాజెక్ట్‌ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.