English | Telugu
మహేష్‌కి రాజమౌళి కండీషన్స్.. సూపర్‌స్టార్ వల్ల అవుతుందా?
Updated : Jan 19, 2024
కొన్ని సంవత్సరాల క్రితం వరకు టాలీవుడ్‌లో హీరోలదే హవా. దర్శకులు, నిర్మాతలు హీరోలు చెప్పిందే వేదవాక్కుగా నడుచుకునేవారు. హీరోలను కమాండ్ చేసే అవకాశం గానీ, వారికి కండీషన్స్ పెట్టే ఛాన్స్‌గానీ ఉండేది కాదు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. డైరెక్టర్.. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనేది తు చ తప్పకుండా పాటించాల్సిన అవసరం హీరోలకు వచ్చింది. డైరెక్టర్ చెప్పింది వింటేనే తమకు విజయాలు దక్కుతాయని గట్టిగా నమ్ముతున్నారు హీరోలు. ఈ మార్పు రావడానికి ముఖ్య కారకుడు రాజమౌళి. దానికి ఆయన చేసిన సినిమాలే నిదర్శనం. సినిమా ఓకే అనుకున్న తర్వాత అతను చెప్పినట్టు హీరో వినాల్సిందే. ఎంత పెద్ద హీరో అయినా తమ ఇగోని పక్కన పెట్టి రాజమౌళి చెప్పినట్టు చెయ్యడానికి వెనుకాడడం లేదు. డైరెక్టర్‌గా రాజమౌళి రేంజ్ అలాంటిది. అతని డైరెక్షన్‌లో ఒక్క సినిమా అయినా చెయ్యాలనేది ప్రతి హీరో కల. అయితే ఆ అవకాశం అందరికీ రాకపోవచ్చు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి హీరోలకు అంత ఇమేజ్ వచ్చిందంటే అది కేవలం రాజమౌళి వల్లే.
ప్రస్తుతం రాజమౌళి తన నెక్స్‌ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పనుల్లో బిజీ అయిపోయాడు. మహేష్‌తో తెరకెక్కించే జంగిల్ అడ్వంచర్ డ్రామా కోసం రాజమౌళి నిరంతరం కృషి చేస్తున్నాడు. రాజమౌళితో సినిమా చెయ్యాలంటే ఏ హీరో అయినా ఎక్కువ రోజులు కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పుడు మహేష్ పరిస్థితి కూడా అదే. మహేష్‌కి రాజమౌళి కొన్ని కండీషన్స్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. మార్చి నుంచి మహేష్‌బాబు బయట ఎక్కడా కనిపించకూడదు, యాడ్స్‌కి సంబంధించిన షూటింగ్‌లో కూడా పాల్గొనకూడదు. అలాగే విహార యాత్రలకు కూడా వెళ్ళకూడదు. ఇవన్నీ ప్రస్తుతం ప్రచారంలో వున్న విషయాలు.
మహేష్ లుక్ బయటకు రాకూడదని రాజమౌళి ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. మహేష్‌పై నెలరోజులపాటు లుక్ టెస్ట్ జరగబోతోందని సమాచారం. హీరో గెటప్‌కి సంబంధించి రాజమౌళి కొన్ని స్కెచ్‌లు వేయించినట్టు తెలుస్తోంది. వాటి ఆధారంగానే లుక్ టెస్ట్ జరుగుతుందట. ఫైనల్ అయిన లుక్‌కి తగ్గట్టు మహేష్ మేకోవర్ కావాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు టాలీవుడ్‌లో మహేష్, రాజమౌళి సినిమాకి సంబంధించి ఈ విషయాలు సర్క్యులేట్ అవుతున్నాయి. రూ.1000 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలుస్తోంది. పాన్ వరల్డ్ మూవీగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది.