English | Telugu

ఆ హీరోకి స్టార్‌డమ్‌ ఇచ్చేందుకు పూరి జగన్నాథ్‌ సిద్ధమవుతున్నారా?

పూరి జగన్నాథ్‌.. ఒకప్పుడు టాలీవుడ్‌ని ఏలిన డైరెక్టర్‌. హీరోలకు బ్లాక్‌బస్టర్స్‌ అందించిన డైరెక్టర్‌. ఎవరూ ఊహించని కథలతో తెలుగు సినిమాను టర్న్‌ చేసిన పూరి ఇప్పుడు ఖాళీ అయిపోయారు. హీరోల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. బాలకృష్ణ, ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, నాగార్జున, రవితేజ, నితిన్‌, రామ్‌ వంటి హీరోలకు సూపర్‌హిట్‌ సినిమాలు ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఆ హీరోలు పూరితో సినిమాలు చేసేందుకు సిద్ధంగా లేరు. అంతేకాదు, ఒక రేంజ్‌ హీరోలు కూడా పూరితో సినిమా అంటే భయపడుతున్నారు. వరస పరాజయాలతో సతమవుతున్న పూరి ఇస్మార్ట్‌ శంకర్‌తో మళ్లీ హిట్‌ ట్రాక్‌లోకి వచ్చారు. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్‌ అయ్యాయి. విజయ్‌ దేవరకొండతో పాన్‌ ఇండియా మూవీగా చేసిన లైగర్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో తనకు కంబ్యాక్‌ ఇచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌కి సీక్వెల్‌గా డబుల్‌ ఇస్మార్ట్‌ను తెరకెక్కించారు. ఇది కూడా డిజాస్టర్‌ కావడంతో పూరి దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. 

తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా పూరి చెప్పుకునే జనగణమన చిత్రాన్ని కొన్ని సంవత్సరాల క్రితం మహేష్‌తో చేయబోతున్నట్టు ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల దాన్ని పక్కన పెట్టారు. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండతో తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ చేస్తానని పూరి ఎనౌన్స్‌ చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన లైగర్‌ డిజాస్టర్‌ కావడంతో ఆ ప్రాజెక్ట్‌ని మొత్తానికి పక్కన పెట్టేశారని తెలుస్తోంది. గత ఆగస్ట్‌లో డబుల్‌ ఇస్మార్ట్‌ రిలీజ్‌ అయింది. అప్పటి నుంచి పూరి చేయబోయే కొత్త సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ప్రస్తుతం పూరికి బ్యాడ్‌ టైమ్‌ నడుస్తోందని, అతనితో సినిమాలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదనే వార్త ఇండస్ట్రీ అంతా స్ప్రెడ్‌ అయిపోయింది. అయితే తాజాగా ఒక ప్రాజెక్ట్‌ సెట్‌ అయ్యే అవకాశం కనిపిస్తోందని సమాచారం. ఒక యంగ్‌ హీరో పూరితో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు, సందీప్‌ కిషన్‌. 

సినిమాటోగ్రాఫర్స్‌ ఛోటా కె.నాయుడు, శ్యామ్‌ కె.నాయుడు మేనల్లుడైన సందీప్‌ కిషన్‌ ఇప్పటివరకు చాలా సినిమాల్లో హీరోగా నటించారు. అంతేకాదు, కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ధనుష్‌ హీరోగా వచ్చిన రాయన్‌ చిత్రంలో కూడా ఒక మంచి క్యారెక్టర్‌ చేశారు. హీరోగా చాలా సినిమాల్లో నటించినప్పటికీ సందీప్‌కి స్టార్‌డమ్‌ అనేది రాలేదు. దీంతో సందీప్‌, పూరి కాంబినేషన్‌ సెట్‌ అవ్వడంలో శ్యామ్‌ కె.నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. ఎంతో మంది హీరోలకు బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చిన పూరి.. ఇప్పుడు సందీప్‌ కిషన్‌కి ఎలాంటి సినిమా చేస్తారోననే సందేహం అందరిలోనూ ఉంది. వీరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. మరి ఫిలింనగర్‌లో వినిపిస్తున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.