English | Telugu
ఎన్టీఆర్ సరసన ప్రియాంక చోప్రా!
Updated : Jun 5, 2023
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తర్వాత వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్న ఎన్టీఆర్.. అందుకు తగ్గట్టుగానే బాలీవుడ్ స్టార్స్ ని రంగంలోకి దింపుతున్నాడు. 'దేవర'లో హీరోయిన్ గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా, విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న 'ఎన్టీఆర్ 31' కోసం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా, ఆ తర్వాత గ్లోబల్ బ్యూటీగా ఎదిగింది. ప్రస్తుతం హిందీ సినిమాలు తగ్గించిన ఈ బ్యూటీ.. ఇంగ్లీష్ లో పలు సినిమాలు, సిరీస్ లతో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు 'ఎన్టీఆర్ 31' కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం. 'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. 'కేజీఎఫ్'తో పాన్ ఇండియా రేంజ్ లో సంచనలం సృష్టించిన ప్రశాంత్ నీల్, ఇప్పుడు 'సలార్'తో అంతకుమించి సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. అలాంటిది ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఏస్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆ అంచనాలను గ్లోబల్ లెవెల్ లో మరోస్థాయికి తీసుకెళ్లడం కోసం హీరోయిన్ గా ప్రియాంక చోప్రాని ఎంపిక చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది. ప్రియాంక సైతం ఈ సినిమా చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లు వినికిడి. జులై 18 న ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా అధికారిక ప్రకటన వచ్చినా ఆశ్చర్యంలేదు అంటున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో ఉన్న 'దేవర', ప్రశాంత్ నీల్ చేస్తున్న 'సలార్' పూర్తి అయ్యాక వీరి కాంబోలో రూపొందనున్న 'ఎన్టీఆర్ 31' చిత్రం 2024, మార్చిలో సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు 'వార్-2'తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. 'దేవర'కి, 'ఎన్టీఆర్ 31'కి మధ్యలో ఆయన 'వార్-2' షూటింగ్ కూడా పూర్తి చేసే అవకాశముంది.