English | Telugu
మహేష్ హీరోయిన్ విషయంలో రాజమౌళి ఎందుకలా చేసినట్టు?
Updated : Jan 23, 2025
మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా గురించి రకరకాల అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి. ఆ మధ్య పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా కోసం ఒక భారీ సెట్‌ను కూడా వేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్ ఎవరై ఉంటారు అనే చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది. చాలా మంది పేర్లు కూడా వినిపించాయి. అయితే సడెన్‌గా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో ల్యాండ్ అయింది. రాజమౌళితో ఆమె చర్చలు జరిపిందని, లుక్ టెస్ట్ కూడా పూర్తి చేసారని వార్తలు వస్తున్నాయి.
రాజమౌళితో సినిమా అంటే హీరోకైనా, హీరోయిన్‌కైనా కొన్ని ఇబ్బందులు తప్పవు. అతని సినిమా సంవత్సరాల తరబడి షూటింగ్ జరుపుకుంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే బల్క్ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రియాంక బాలీవుడ్ సినిమాలే కాకుండా హాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ కారణంగా బల్క్ డేట్స్ ఇచ్చే అవకాశం లేదు. అయితే ఈ విషయంలో ప్రియాంక ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాజమౌళి సినిమాలో దాదాపు ఆమె హీరోయిన్‌గా ఖరారైనట్టే అని తెలుస్తోంది. ఇప్పుడు ప్రియాంక దృష్టి హాలీవుడ్‌పైనే ఉంది. రాజమౌళి చేసే సినిమా కూడా హాలీవుడ్ స్థాయిలోనే ఉంటుందనే ప్రచారం జరుగుతోంది కాబట్టి ఆమెనే ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది.
ఇక ఇప్పటివరకు మహేష్ చేసిన సినిమాలను పరిశీలిస్తే హీరోయిన్లంతా అతని కంటే చాలా తక్కువ వయసు వాళ్ళే కనిపిస్తారు. ఇప్పటికే మహేష్ 50కి చేరువలో ఉన్నారు. ప్రియాంక 40 ప్లస్‌కి వచ్చేసింది. అంత ఏజ్ ఉన్న హీరోయిన్‌ని మహేష్ కోసం ఎలా సెలెక్ట్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. రాజమౌళి సినిమాల్లో హీరోయిన్‌కి అంత ప్రాధాన్యం ఉండదన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయానికి వస్తే.. హీరోయిన్‌కి కూడా ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ, యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోయిన్‌ని తీసుకోకుండా ప్రియాంకపైనే రాజమౌళి ఎందుకు కాన్‌సన్‌ట్రేట్ చేస్తున్నారనేది ఎవరికీ అర్థం కాని విషయం. ఇదే కన్‌ఫర్మ్ అయితే మహేష్ సరసన మొదటిసారి 40 ప్లస్ హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా కనిపిస్తుంది. మరి ఈ విషయంలో మహేష్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.