English | Telugu

'తేరి' రీమేక్ లో పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' ఇటీవల విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మలయాళ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం'కి రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. పవన్ గత చిత్రం 'వకీల్ సాబ్' కూడా రీమేక్ కావడం విశేషం. ఇదిలాఉంటే తాజాగా పవన్ మరో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యాడని తెలుస్తోంది.

కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన 'తేరి' మూవీ తెలుగు రీమేక్ లో పవన్ నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. 2016 లో వచ్చిన ఈ సినిమా పోలీసోడు పేరుతో తెలుగులో కూడా విడుదల కావడం విశేషం. గతంలో మరో కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన 'వీరం' కూడా తెలుగులో 'వీరుడొక్కడే' పేరుతో విడుదల కాగా, దానిని 'కాటమరాయుడు' పేరుతో రీమేక్ చేశాడు పవన్. ఇప్పుడు అదే బాటలో 'తేరి' రీమేక్ చేయబోతున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఈ రీమేక్ కి సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.

పవన్ కి పోలీస్ కథల రీమేక్ లు కలిసొచ్చాయి. 'దబాంగ్' రీమేక్ గా వచ్చిన 'గబ్బర్ సింగ్' సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు 'భీమ్లా నాయక్' కూడా సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. అదే సెంటిమెంట్ తో ఇప్పుడు పవన్ కన్ను తేరిపై పడిందని టాక్. ప్రస్తుతం పవన్ చేతిలో 'హరిహర వీరమల్లు', 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలతో పాటు సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ఉంది. వాటి తర్వాత తేరి రీమేక్ పట్టాలెక్కే అవకాశముందని న్యూస్ వినిపిస్తోంది.