English | Telugu

షాకింగ్‌.. పవన్‌కళ్యాణ్‌, అట్లీ కాంబినేషన్‌లో రూ.1000 కోట్ల సినిమా.. త్రివిక్రమ్‌ నిర్మాత!

కొందరు హీరోలు చేసే సినిమాలు తక్కువే అయినా సోషల్‌ మీడియాలో మాత్రం హడావిడి ఎక్కువ కనిపిస్తుంటుంది. సినిమాలు చేసినా చెయ్యకపోయినా కొత్త కాంబినేషన్లు సెట్‌ అవుతున్నాయంటూ వార్తలు వస్తూనే ఉంటాయి. అది రాను రాను కామెడీగా మారిపోతోంది. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌ విషయంలో అదే జరుగుతోంది. ఓ పక్క రాజకీయాల్లో తల మునకలై ఉన్న పవన్‌ను కొత్త కాంబినేషన్లు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే పూర్తి చెయ్యాల్సిన సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి కాకుండానే మరో ప్రాజెక్ట్‌ సెట్‌ అయ్యిందంటూ ప్రచారం జరుగుతోంది. అందులో నిజమెంత వుందో తెలీదుగానీ, ప్రాజెక్ట్‌ మాత్రం క్రేజీగానే కనిపిస్తోంది. అది నిజంగా సెట్‌ అయితే టాలీవుడ్‌లో పవన్‌కల్యాణ్‌ కొత్త రికార్డులు క్రియేట్‌ చెయ్యడం ఖాయం అంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఊహించడానికి కూడా కష్టమైన ఓ కాంబినేషన్‌ గురించి ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే.. ‘జవాన్‌’ చిత్రంతో కలెక్షన్ల సునామీ సృష్టించిన డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ నటించనున్నాడట. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ నిర్మాత అనీ, రూ.1000 కోట్ల బడ్జెట్‌తో నిర్మించే ఈ సినిమాకి అతనితోపాటు మరో నిర్మాత కూడా ఉంటారన్నది ఆ వార్త. ఈ కాంబినేషన్‌ ఎంతో ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ఇది ఎంత వరకు సాధ్యం అనేది ప్రశ్న. ఇప్పటికే పవన్‌కళ్యాణ్‌ పూర్తి చేయాల్సిన సినిమాలు రెడీగా ఉన్నాయి. ‘ఓజి’, ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, ‘హరిహర వీరమల్లు’ సినిమాలు కంప్లీట్‌ అయితే తప్ప మరో సినిమా ఓకే చేసే అవకాశం లేదు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్‌ షూటింగ్స్‌కి గ్యాప్‌ తీసుకున్నాడు. ఎలక్షన్స్‌ పూర్తయిన వెంటనే ఈ సినిమాలు పూర్తి చెయ్యాలని పవన్‌ భావిస్తున్నాడట. సుజిత్‌ డైరెక్షన్‌లో చేస్తున్న ‘ఓజి’ చిత్రాన్ని ముందుగా పూర్తి చేసి, ఆ తర్వాత హరీష్‌శంకర్‌ డైరెక్షన్‌లో చేస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, క్రిష్‌ డైరెక్షన్‌లో చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రాల కోసం పనిచేయనున్నాడు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాతే మరో ప్రాజెక్ట్‌ గురించి ఆలోచించే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాల తర్వాత అట్లీ దర్శకత్వంలో సినిమా ఉంటుందనే వార్త బలంగా వినిపిస్తోంది. ఇంత బలంగా ఈ న్యూస్‌ స్ప్రెడ్‌ అవ్వడానికి రీజన్‌ ఏమిటో తెలియకపోయినా ఈ కాంబినేషన్‌ క్రేజీగానే ఉంటుందనేది వాస్తవం. నిజానికి అల్లు అర్జున్‌తో అట్లీ ఓ సినిమా చేయనున్నాడు. పవన్‌, అట్లీ కాంబినేషన్‌లో సినిమా అనేది నిజమే అయితే అది బన్ని సినిమా పూర్తయిన తర్వాతే స్టార్ట్‌ అయ్యే అవకాశం ఉంది. 

పవన్‌కళ్యాణ్‌, అట్లీ కాంబినేషన్‌లో సినిమా అనీ, త్రివిక్రమ్‌ నిర్మాత అనీ వస్తున్న ఈ వార్త ఎవరికీ నమ్మశక్యంగా లేదు. పైగా ఈ ప్రాజెక్ట్‌ బడ్జెట్‌ రూ.1000 కోట్లు ఉంటుందని కూడా చెప్పుకుంటున్నారు. ఏ విధంగా చూసినా ఇది పట్టాలెక్కే ప్రాజెక్ట్‌ కాదనేది అర్థమవుతోంది. అసలు ఈ న్యూస్‌ ఎలా క్రియేట్‌ అయ్యిందో తెలీదుగానీ, సోషల్‌ మీడియాలో మాత్రం వైరల్‌గా మారిపోయింది. ఒకవేళ ఇది నిజమే అయితే పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ సినిమాగా ఇది నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.