English | Telugu

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ మల్టీస్టారర్!

'ఆర్ఆర్ఆర్' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకొని ఈ జనరేషన్ లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కి తెరదీసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు టాలీవుడ్ నుంచి మరో భారీ మల్టీస్టారర్ కి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ హీరోలుగా దర్శకుడు త్రివిక్రమ్ ఓ బడా ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్, 'పుష్ప: ది రైజ్'తో అల్లు అర్జున్ పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాతో పాటు, బాలీవుడ్ మూవీ 'వార్-2' చేయనున్నాడు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో 'పుష్ప-2' చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని వినికిడి. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా భాగం కానున్నాడని ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తోంది.

బన్నీ, త్రివిక్రమ్ ది హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్. వీరి కలయికలో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' సినిమాలు రాగా.. మూడూ హిట్ అయ్యాయి. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' సంచలన విజయాన్ని అందుకుంది. ఇక తారక్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అరవింద సమేత' కూడా ఘన విజయం సాధించింది. నిజానికి 'ఆర్ఆర్ఆర్' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలోనే తారక్ ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఏవో కారణాల వల్ల పట్టాలెక్కలేదు. అయితే తారక్-త్రివిక్రమ్ కాంబోలో ఖచ్చితంగా మూవీ ఉంటుందని, అది పాన్ వరల్డ్ లో రేంజ్ సినిమా అవుతుందని ఆమధ్య నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలీదు కానీ, ప్రస్తుతం మహేష్ బాబు తో 'ఎస్ఎస్ఎంబి 28' చేస్తున్న త్రివిక్రమ్.. దాని తర్వాత తారక్-బన్నీ తో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరిది నిజంగా సాధ్యమవుతుందో లేదో చూడాలి. ఎందుకంటే ఈ ఏడాది చివరి నాటికి త్రివిక్రమ్ చేస్తున్న 'ఎస్ఎస్ఎంబి 28', బన్నీ నటిస్తున్న 'పుష్ప-2' పూర్తవుతాయి. తారక్ నటిస్తున్న 'దేవర' కూడా పూర్తవుతుంది కానీ, ఆ వెంటనే ఆయన 'ఎన్టీఆర్ 31', 'వార్-2' సినిమాలతో బిజీ కానున్నాడు. ఈ లెక్కన 2024 చివరిదాకా ఎన్టీఆర్ అందుబాటులో ఉండే అవకాశాలు లేవు.