English | Telugu

బాహుబలి వెబ్ సీరీస్ లో నయనతార!!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాగా బాహుబలిని చెబుతుంటారు. అయితే ఇప్పుడీ సినిమాకి ప్రీక్వెల్ గా రానున్న వెబ్ సీరీస్ గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సిరీస్ లో సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార నటించనుందని టాక్ వినిపిస్తోంది.

'బాహుబలి: బిఫోర్ ది బిగెనింగ్' పేరిట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ వ్యయంతో సీరీస్ ను తెరకెక్కిస్తోంది. తాజా సమాచారం ప్రకారం నయనతార ఈ వెబ్ సిరీస్‏లో కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. నయనతారకు సంబంధించిన చిత్రీకరణ సెప్టెంబర్‏లో ప్రారంభం కానున్నట్లుగా సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు.

కాగా, బాహుబలి చిత్రాన్ని మొత్తం తొమ్మిది భాగాలుగా వెబ్ సిరీస్‏ గా చేయబోతున్నట్లుగా గతంలోనే ప్రకటించింది నెట్‏ఫ్లిక్స్. ప్రస్తుతం 'బాహుబలి: బిఫోర్ ది బిగెనింగ్' ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ సిరీస్ తెలుగుతో పాటు తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.