English | Telugu
బాప్‌రే.. 'జాతిరత్నాలు' డైరెక్టర్ సినిమాకు శివకార్తికేయన్ రెమ్యూనరేషన్ 25 కోట్లా?
Updated : Jul 17, 2021
శివకార్తికేయన్ మార్కెట్ తమిళనాట రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల అతను ఒక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి సంతకం చేశాడు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా అనుదీప్ కె.వి. డైరెక్ట్ చేసిన ఫిల్మ్ 'జాతిరత్నాలు'. కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఆ సినిమా సెన్సేషనల్ హిట్టయి, రూ. 60 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. దానికి సీక్వెల్ కోసం అనుదీప్ స్క్రిప్ట్ రెడీ చేస్తుండగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ అతనికి భారీ పారితోషికంతో ఓ సినిమాను ఆఫర్ చేసింది. ఏషియన్ గ్రూప్‌లో భాగమైన ఆ సంస్థకు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఉన్నాయి. ఇప్పటికే ధనుష్-శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో ఓ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రాన్ని అది ప్రకటించింది.
ఇటీవల అనుదీప్ చెప్పిన కథ నచ్చడంతో దానికి ఓకే చేశాడు శివకార్తికేయన్. తెలుగు, తమిళ భాషలు రెండింటిలోనూ ఈ సినిమా తీయనుండటంతో శివకార్తికేయన్ రెమ్యూనరేషన్ అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ సినిమాకు అతను ఏకంగా రూ. 25 కోట్లు అందుకుంటున్నాడని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకూ అతను తీసుకున్న పారితోషికంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.
తమిళ హీరోలకు తెలుగునాట కూడా ఆదరణ పెరుగుతుండటంతో రెండు ప్రాంతాల్లోనూ తమ సినిమాకు మార్కెట్ లభిస్తుందనే ఉద్దేశంతో టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు వారితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తమ పారితోషికం కూడా భారీగా పెరుగుతుండటంతో ఈ ద్విభాషా చిత్రాలకు హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.