English | Telugu

ఆ కటౌట్లు మోక్షజ్ఞ ఎంట్రీ కి సంకేతాలా?!

ప్రస్తుతం అందరి చూపు నందమూరి నట‌సింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందంల‌ ఎంట్రీ పైనే ఉంది. ఎప్పుడెప్పుడు వారు తెరంగేట్రం చేస్తారా? అని వారి అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక అకిరానందన్ విషయానికి వస్తే ఆయనకు తగ్గ స్టోరీని ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన స్నేహితుడు, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అప్పగించాడని ప్రచారం జరుగుతోంది. అజ్ఞాతవాసి తర్వాత మరోసారి త్రివిక్ర‌మ్ ని  నమ్మి మోసపోవద్దని పవన్‌ను ఆయ‌న ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు.

ఇక నందమూరి మోక్షజ్ఞ విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 కి సీక్వెల్లో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ  ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆదిత్య 369 కి  లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకులు. మరి ఆదిత్య 369 కి సీక్వెల్ గా రూపొందే  ఆదిత్య 999 కు ఎవరు దర్శకత్వం వహిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. బాలయ్య సొంత దర్శకత్వంలోనే ఈ చిత్రం ఉంటుందని, ఇందులో బాలయ్య కూడా ఓ కీలక పాత్రను చేస్తాడని వార్తలు వస్తున్నాయి. కాగా ఇటీవల వీర సింహారెడ్డి ప్రీరిలీజ్  ఈవెంట్ ఒంగోలులో జరిగింది. 

ఈ సందర్భంగా ఒంగోలులో ఆదిత్య 369 కు సంబంధించిన కటౌట్లు అందర్నీ ఆకట్టుకున్నాయి. వాటిని ప్రత్యేకంగా తయారు చేసి మరి అక్కడ పెట్టారు. దాంతో నందమూరి మోక్షజ్ఞ ఈ చిత్రం ద్వారా ఎంట్రీ ఇస్తాడని సంకేతాలందుతున్నట్లుగా నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబు క్రేజ్ మొత్తం చూసుకుంటే ఇప్పుడు ఓ లెవెల్ లో ఉంది.  ఇంతకాలం ఓవర్సీస్ లో ఆయనకు పెద్దగా మార్కెట్ లేదు. కానీ అన్ స్టాప‌బుల్ విత్ ఎన్.బి.కె.  తో ఆయనకు ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. చాలా మంది బాల‌య్య టాక్ షోని న‌డిపే విధానం, మాట‌ల చాతుర్యం చూసి ఆయ‌న్ను ఇష్ట‌ప‌డుతున్నారు.  అయితే బాలకృష్ణ తనయుడు ఎంట్రీ విష‌యంలో ఏ మాత్రం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్న తర్వాతనే అతని పరిచయం చేయాలని అనుకుంటున్నారు. ఈ మధ్యనే మోక్షజ్ఞ  మీద బాలయ్య కాస్త సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. గతంలో అయితే అతడిని బయట ప్రపంచంలో ఎక్కువగా తిర‌గనిచ్చేవారు కాదు.  

కానీ ఈమధ్య ఏదైనా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే స్పెషల్ షోలకు తీసుకువెళుతున్నారు. ఈమధ్య హిట్2 చూపించారు. అంతేకాకుండా వీరసింహారెడ్డి సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో కూడా మోక్షజ్ఞ పాల్గొన్నారు. షూటింగ్ వాతావరణం అలవాటు అయ్యే విధంగా ముందుగానే షూటింగ్లకు తీసుకు వస్తున్నట్లు అర్థమవుతుంది. దానికి త‌గ్గ‌ట్లుగా ఆదిత్య 369 కి సీక్వెల్ ఆదిత్య 999 తో మోక్ష‌జ్ఞ ఎంట్రీని బాల‌య్య ఖ‌రారు చేయ‌డం  ఖాయమని అంటున్నారు. అయితే ఈ కథ ఎంతవరకు వచ్చింది? అనే విషయంలో క్లారిటీ లేదు. కొడుకును  మాత్రం కాస్త ఎక్కువగా బయటకు తిప్పుతూ ఉండటంతో ఒక విధంగా ఎంట్రీకి రంగం సిద్ధమవుతుందని సంకేతాలు పంపుతున్నట్లుగా అర్ధ‌మ‌వుతోంది.