English | Telugu
మోహన్ రాజా దర్శకత్వంలో అక్కినేని మల్టీస్టారర్!
Updated : Oct 9, 2022
'హనుమాన్ జంక్షన్'(2001) సినిమాతో దర్శకుడిగా పరిచయమై తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మోహన్ రాజా.. చాలా ఏళ్ళ తర్వాత రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన 'గాడ్ ఫాదర్'తో సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే ఇంతకాలం ఎక్కువగా తమిళ సినిమాలు చేసిన మోహన్ రాజా ఇకపై తెలుగు సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన అక్కినేని హీరోలతో ఓ భారీ మల్టీస్టారర్ చేయబోతున్నట్లు సమాచారం.
అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి నటించిన 'మనం'(2014) మూవీ క్లాసిక్ హిట్ గా నిలిచింది. అందులో నాగేశ్వరావు, నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రలు పోషించగా.. అఖిల్ ప్రత్యేక పాత్రలో నటించాడు. అలాగే ఈ ఏడాది 'బంగార్రాజు' చిత్రంలో నాగార్జున, చైతన్య కలిసి నటించి అలరించారు. 'బంగార్రాజు'లో పెద్ద కొడుకు చైతన్యతో కలిసి నటించిన నాగార్జున.. ఇప్పుడు చిన్న కొడుకు అఖిల్ తో కలిసి నటించడానికి సిద్ధమైనట్లు న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.