English | Telugu

చిరంజీవి లేకుండానే 'వేదాళ‌మ్' రీమేక్ మొద‌లైంది!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో 'ఆచార్య' మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ వైపు 'ఆచార్య' సినిమా చేస్తూనే, మ‌రోవైపు మ‌రికొన్ని సినిమాల‌కు చిరంజీవి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. వాటిలో 'లూసిఫ‌ర్' రీమేక్, 'వేదాళమ్‌' రీమేక్, బాబీ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా ఉన్నాయి. ఫిల్మ్‌న‌గ‌ర్‌లో జ‌రుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం ఇప్ప‌టికే 'వేదాళమ్‌' రీమేక్ షూటింగ్ మొద‌లైపోయిందంట‌. చిరంజీవి లేకుండానే డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేశ్ ఈ సినిమా షూటింగ్‌కు చాలా రోజుల నుంచే జ‌రుపుతూ వ‌స్తున్నాడంట‌.

'వేదాళ‌మ్' మూవీ కోల్‌క‌తా నేప‌థ్యంలో రూపొందింది. తెలుగు వెర్ష‌న్‌కు కూడా అదే నేప‌థ్యాన్ని ఎంచుకున్నారు. ద‌స‌రా పండ‌గ స‌మయంలో మెహ‌ర్ ర‌మేశ్ బృందం కోల్‌క‌తా వెళ్లి అక్క‌డి ద‌స‌రా ఉత్స‌వాలు, దుర్గా పూజ‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను దుర్గామాత గుడిలో చిత్రీక‌రించుకొని వ‌చ్చార‌ని వినిపిస్తోంది. 'ఆచార్య' షూటింగ్‌ను పూర్తిచేసిన వెంట‌నే 'వేదాళ‌మ్' రీమేక్ షూటింగ్‌లో చిరంజీవి పాల్గొన‌నున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డ‌వ‌నున్నాయి.