English | Telugu

మరో రీమేక్ లో మెగాస్టార్!

రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా రీమేక్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన రీఎంట్రీ ఫిల్మ్ 'ఖైదీ నెంబర్ 150'.. తమిళ సినిమా 'కత్తి'కి రీమేక్ అనే విషయం తెలిసిందే. అలాగే మలయాళ చిత్రం 'లూసిఫర్'కు రీమేక్ గా 'గాడ్ ఫాదర్' చేశారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'భోళా శంకర్' సైతం తమిళ్ మూవీ 'వేదాళం'కి రీమేకే. ఇదిలా ఉంటే మెగాస్టార్ ఇప్పుడు మరో రీమేక్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించిన మలయాళ చిత్రం 'బ్రో డాడీ'. పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది జనవరిలో ఓటీటీలో విడుదలై అలరించింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు రీమేక్ లో చిరంజీవి నటించడానికి ఓకే చెప్పినట్లు న్యూస్ వినిపిస్తోంది. నిజానికి ఈ రీమేక్ లో మెగాస్టార్ నటించే అవకాశముందని గతేడాదే వార్తలొచ్చాయి. అయితే ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ న్యూస్ తెరపైకి వచ్చింది. 'బ్రో డాడీ' రీమేక్ లో చిరంజీవి నటించడం ఖాయమైందని అంటున్నారు. ఒరిజినల్ లో మోహన్ లాల్ పోషించిన పాత్రలో చిరంజీవి నటించనుండగా.. పృథ్వీరాజ్ పోషించిన కొడుకు రోల్ లో ఏ యంగ్ హీరో నటిస్తాడు?, డైరెక్టర్ ఎవరు? అనే ఆసక్తి నెలకొంది. అయితే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ ఓ సినిమా చేయనున్నారని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అది 'బ్రో డాడీ' రీమేక్ అని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఇందులో చిరంజీవి కొడుకుగా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కనిపించనున్నాడని సమాచారం.

ఇదిలా ఉంటే గతంలో చిరంజీవి 'గాడ్ ఫాదర్'గా రీమేక్ చేసిన 'లూసిఫర్' సైతం మోహన్ లాల్-పృథ్వీరాజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమానే కావడం విశేషం. మలయాళంలో ఆ సినిమా సంచలన విజయాన్ని అందుకోగా.. తెలుగులో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. మరి ఇప్పుడు ఈ 'బ్రో డాడీ' తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.