English | Telugu

పవన్ మాటల వెనుక అర్థమేంటి..?

అజ్ఞాతవాసి ఆడియో లాంఛ్ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈవెంట్‌కు ఎవరెవరో వస్తారని అనుకున్నా వారెవరు రాకపోయినప్పటికి.. త్రివిక్రమ్, పవన్‌లు ఎప్పటిలాగే షోను నడిపించేశారు. ఆడియో లాంఛ్‌లో వీరిద్దరు ఒకరిపై ఒకరికి ఉన్న బంధాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తనను చాలా మంది ఒంటిరి వాడిని చేసినప్పుడు.. పరాజయాల సమయంలో తనతో ఎవరూ లేనప్పుడు త్రివిక్రమ్ అండగా ఉన్నారని.. తనను డిప్రెషన్‌లోంచి త్రివిక్రమే బయటకు తీసుకువచ్చారని పవన్ చెప్పాడు.

రక్తం పంచుకుని పుట్టిన వారికన్నా.. త్రివిక్రమ్ దగ్గరే నాకు చనువు ఎక్కువని.. ఎవర్నీ కోప్పడలేను కానీ.. ఆయనపై కోప్పడగలను వెల్లడించారు. ఖుషి తర్వాత చేసిన సినిమాలు పరాజయం పాలవ్వడంతో పరిశ్రమ నుంచి నిష్క్రమించాలని అనుకున్నానని.. కానీ మీ ప్రేమే నన్ను సినిమాల్లో ఉంచిందన్నారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. చాలా రోజుల నుంచి మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు పవన్.. ఆ కుటుంబానికి సంబంధించిన మూవీ ఈవెంట్లలోనూ.. శుభకార్యాల్లోనూ పవర్‌స్టార్ కనిపించిన దాఖలాలు లేవు. అందువల్ల మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి ఈ మాటలు అన్నాడని కొంతమంది.. కాదు కాదు తనపై సానుభూతిని పెంచుకుని.. ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకునేందుకే అలా అన్నాడని.. మరి కొంతమంది సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.