English | Telugu

రెండు రోజుల ముందు ప్లాన్.. హాలోని గట్టెక్కిస్తుందా..?

గతంలో ప్రతి సినిమాకు.. హీరోలకు.. అభిమానులకు మధ్య వారథిగా ఆడియో వేడుకలు ఉండేవి. వాటిని ఎంతో గ్రాండ్‌గా ప్లాన్ చేసి, అభిమానుల సమక్షంలో జరిపేవారు. ప్రజంట్ ఆడియో వేడుకల స్థానంలో కొత్తగా ప్రీరిలీజ్ ఈవెంట్లు చేయడం మొదలుపెట్టింది టాలీవుడ్. సినిమా రిలీజ్‌కు ఒక పది, పదిహేను రోజుల ముందు చిత్రయూనిట్ మొత్తాన్ని ఒక స్టేజ్ మీదకు తీసుకొచ్చేసి.. మూవీ ఇలా వచ్చింది.. అలా వచ్చింది.. ఎంత కష్టపడింది చెబుతూ ప్రేక్షకులకు సినిమా మీద క్యూరియాసిటీ పెంచుతారు. ఈ పదిహేను రోజులు సినిమా గురించి మాట్లాడుకునేలా పాటలు, టీజర్, ట్రైలర్ ఎలాగు ఉంటాయి. అలాంటిది రెండు రోజుల్లో సినిమా పెట్టుకుని ప్రీరిలీజ్ ఈవెంట్ చేస్తే.. అలాంటి కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు కింగ్ నాగార్జున.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తన కొడుకు అఖిల్ నటించిన హలో ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి టైంలో దానికి సరిగ్గా రెండు రోజుల ముందు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఆ చిత్ర నిర్మాత నాగార్జున. ఇప్పుడు ఇదే ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అందుకు చాలా కారణాలే చెబుతున్నారు విశ్లేషకులు. హలో సినిమా ద్వారా అఖిల్‌ కెరీర్‌ను లైన్లో పెట్టాలని ఒక పద్దతి ప్రకారం వెళుతున్నాడు నాగ్. వైజాగ్‌లో గ్రాండ్‌గా ఆడియో రిలీజ్ కూడా చేశాడు. అయితే హలో రిలీజ్‌కు ఒక రోజు ముందు నాని నటించిన ఎంసీఏ విడుదలవుతుండటం.. ఇదే టైంలో పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్ అజ్ఞాతవాసి మ్యానియా మొదలవ్వడంతో.. ఎంతగా ప్రమోషన్ చేసినా హాలో సోదిలో లేకుండా పోయింది. అందుకే హలో‌ని లైమ్‌ లైట్‌లోకి తీసుకొచ్చేందుకు.. విడుదలకు రెండు రోజుల ముందు ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారా అంటూ చెవులు కొరుక్కుంటున్నారు సినీజనాలు.