English | Telugu
టిల్లుతో మెగా డైరెక్టర్.. పవన్ కళ్యాణ్ సినిమా అటకెక్కినట్టేనా!
Updated : May 22, 2024
టాలీవుడ్ లో స్టైలిష్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డికి పేరుంది. 'అతనొక్కడే', 'కిక్', 'రేసుగుర్రం', 'ధృవ' వంటి హిట్ సినిమాలు ఆయన డైరెక్షన్ లో వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన ట్రాక్ రికార్డు గొప్పగా లేదు. 'సైరా నరసింహారెడ్డి' పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ భారీ బిజినెస్ కారణంగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలింది. ఇక గత చిత్రం 'ఏజెంట్' అయితే డిజాస్టర్ గా నిలిచింది. దీంతో సురేందర్ రెడ్డి అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది కానీ అదసలు మొదలవుతుందో లేదో.. ఒకవేళ మొదలైనా ఎప్పటికి అవుతుందో తెలియదు. దీంతో కొంతకాలంగా ఈ స్టైలిష్ డైరెక్టర్.. కొత్త హీరోని వెతికే పనిలో పడ్డాడు. మధ్యలో వెంకటేష్, విక్రమ్ వంటి హీరోల పేర్లు వినిపించాయి కానీ.. అవీ కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో మరో హీరో పేరు తెరపైకి వచ్చింది.
'టిల్లు స్క్వేర్'తో సంచలన విజయాన్ని అందుకొని మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోగా మారిన సిద్ధు జొన్నలగడ్డ చేతిలో ప్రస్తుతం 'జాక్', 'తెలుసు కదా', 'టిల్లు క్యూబ్' వంటి సినిమాలు ఉన్నాయి. ఎందరో దర్శక నిర్మాతలు సిద్ధుతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో సురేందర్ రెడ్డి దృష్టి కూడా సిద్ధుపై పడినట్లు తెలుస్తోంది. సిద్ధుతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎంటర్టైనర్స్ తీయడంలో సురేందర్ రెడ్డి దిట్ట. సిద్ధు కామెడీ టైమింగ్ కూడా అదిరిపోతుంది. ఈ ఇద్దరు కలిసి 'కిక్', 'రేసు గుర్రం' లాంటి యాక్షన్ కామెడీ ఫిల్మ్ చేస్తే.. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుంది అనడంలో సందేహం లేదు.