English | Telugu

బ్రేకింగ్‌.. టాలీవుడ్‌ హీరోతో మీనాక్షీ చౌదరి పెళ్లి..?

సినిమా ఇండస్ట్రీలో రూమర్స్‌ అనేవి సర్వసాధారణం. ఇవి ఎక్కువగా హీరో, హీరోయిన్‌ మధ్య ఎఫైర్‌ ఉందని కావచ్చు, వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనేది కావచ్చు. ఏది ఏమైనా అలాంటి రూమర్స్‌ ఎక్కువ ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా స్టార్స్‌గా ఒక రేంజ్‌లో ఉన్నవారికి సంబంధించినది అయితే జనం మరింత ఆసక్తి కనబరుస్తారు. ఇలాంటి రూమర్స్‌ సినిమా పుట్టిన నాటి నుంచీ ఉన్నాయి. ఆరోజుల్లో మీడియా ఇంతగా విస్తరించి లేకపోవడం వల్ల బయటి జనానికి అంతగా తెలిసేది కాదు. కానీ, ఇప్పుడలా కాదు, చీమ చిటుక్కుమంటే దాన్ని కూడా వైరల్‌ చేసేస్తున్నారు. ఇక హీరో, హీరోయిన్‌కి సంబంధించిన వార్త అయితే అది ఎంత వైరల్‌ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఇటీవలి కాలంలో చాలా మంది టాలీవుడ్‌ హీరోలు, హీరోయిన్లు ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం మనం చూశాం. పెళ్లికి ముందు వారికి సంబంధించి ఎన్నో వార్తలు, కథనాలు మీడియాలో వచ్చాయి. కానీ, వాటిని ఆ క్షణంలో ఖండిరచిన జంటలు ఆ తర్వాత పెళ్ళి చేసుకున్నారు. హీరో సుశాంత్‌, హీరోయిన్‌ మీనాక్షీ చౌదరి గురించి అలాంటి వార్తే సర్క్యులేట్‌ అవుతోంది. మీనాక్షీ ఇటీవలికాలంలో హీరోయిన్‌గా బిజీ అవుతోంది. వరసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది. ఈ ముద్దుగుమ్మ సుశాంత్‌తో ప్రేమ వ్యవహారం నడుపుతోందని, త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతోందనే వార్త బలంగా వినిపిస్తోంది. 

ఏదో ఒక రూమర్‌లా కాకుండా.. ఇది నిజం అన్నట్టుగా ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మీనాక్షీ చౌదరి టీమ్‌ స్పందిస్తూ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. సుశాంత్‌, మీనాక్షీ మంచి స్నేహితులనీ, వారి మధ్య ఎలాంటి బంధం లేదని చెబుతూ ఇద్దరినీ స్నేహితులుగానే పరిగణించాలని మీనాక్షీ టీమ్‌ కోరింది. దీనిపై మీనాక్షీ వ్యక్తిగతంగా స్పందించకపోవడంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆమె ఇప్పుడు షూటింగులతో బిజీగా ఉందని, స్పందించే తీరిక కూడా ఆమెకు లేదని కొందరంటున్నారు. ఈ ఏడాది ఆరంభంలో మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం చిత్రంలో మీనాక్షీ నటించినప్పటికీ అది ఏమాత్రం ప్రాధాన్యం లేని క్యారెక్టర్‌ కావడంతో ఆ సినిమా ఆమెకు అంతగా ప్లస్‌ అవ్వలేదు. అయితే గత రెండు నెలలుగా ఆమె నటించిన సినిమాలు వరసగా రిలీజ్‌ అవుతున్నాయి. గోట్‌, లక్కీ భాస్కర్‌, మట్కా వంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. త్వరలోనే మెకానిక్‌ రాకీ, సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా రాబోతున్నాయి. ప్రస్తుతం ఆమె పొజిషన్‌ చూస్తుంటే.. ఇలాంటి రూమర్స్‌ని పట్టించుకోకుండా సినిమాలపైనే కాన్‌సన్‌ట్రేట్‌ చేస్తున్నట్టు కనిపిస్తోంది. 

అసలు సుశాంత్‌, మీనాక్షీల గురించి ఇలాంటి రూమర్‌ రావడానికి ప్రధాన కారణం ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమా. ఈ సినిమాలో సుశాంత్‌ హీరోగా నటించాడు. ఈ సినిమాతోనే మీనాక్షీ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లో ఆమె ఫస్ట్‌ హీరో సుశాంత్‌. కాబట్టి వారి మధ్య ఫ్రెండ్‌షిప్‌ ఉండే అవకాశం ఉంది, అది బలపడే అవకాశం కూడా ఉంది. దాన్ని ఆసరాగా చేసుకొని ఇలాంటి రూమర్స్‌ పుట్టుకొస్తూ ఉండొచ్చు. బయట వినిపిస్తున్న దాని ప్రకారం వారిమధ్య ఏదైనా ఉందా అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే వీరిద్దరూ తరచూ కలుసుకుంటారని, మనసు విప్పి మాట్లాడుకుంటారని మాత్రం చెప్పుకుంటున్నారు.