English | Telugu

'ఏజెంట్' కోసం భారీ రెమ్యూన‌రేష‌న్?

స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని బుల్లోడు అఖిల్.. 'ఏజెంట్' పేరుతో ఓ స్పై థ్రిల్ల‌ర్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్ళ‌నుంది. ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర కోసం మాలీవుడ్ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ గానీ, శాండ‌ల్‌వుడ్ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర గానీ న‌టించే అవ‌కాశ‌ముంద‌ని ఆ మ‌ధ్య ప్ర‌చారం సాగింది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఇందులో మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి ఆ పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. అంతేకాదు.. ఇది క్లాస్ ట‌చ్‌తో సాగే వేష‌మని స‌మాచారం.

కాగా, ఈ పాత్ర కోసం మ‌మ్ముట్టి షాకింగ్ రెమ్యూన‌రేష‌న్ అందుకోనున్నార‌ట‌. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ఆయ‌న ఏకంగా రూ. 3 కోట్ల పారితోషికం పుచ్చుకుంటున్నార‌ని తెలిసింది. మ‌మ్ముట్టికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ మొత్తం ఇవ్వ‌డానికి నిర్మాత‌లు కూడా అంగీకారం తెలిపార‌ని టాక్. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ ప‌తాకంపై అనిల్ సుంక‌ర నిర్మిస్తున్న 'ఏజెంట్'కి యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ బాణీలు అందిస్తున్నారు. సాక్షి వైద్య నాయిక‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. డిసెంబ‌ర్ 24న థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నుంది.