English | Telugu

హిమాల‌యాల‌కు మ‌హేశ్‌?

కెరీర్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌. సంక్రాంతికి విడుద‌లైన 'స‌రిలేరు నీకెవ్వ‌రు' మూవీ అత‌ని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. ఆ స‌క్సెస్‌ను ఆస్వాదిస్తున్న స‌మ‌యంలోనే పేరుపొందిన బ్రాండ్ 'కార్ దేఖో' ఎండార్స్‌మెంట్ అత‌నికి ల‌భించింది. మ‌రోవైపు ట్విట్ట‌ర్ వేదిక‌పై సౌత్ ఇండియా మొత్త‌మ్మీద 9 మిలియ‌న్ ఫాలోయ‌ర్స్ ఉన్న ఏకైక ఫిల్మ్ స్టార్‌గా నిలిచాడు. ఇలా ఏ ర‌కంగా చూసినా మ‌హేశ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. త‌న త‌దుప‌రి సినిమాను ప‌ర‌శురామ్ డైరెక్ష‌న్‌లో చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తోన్న 'ఆచార్య' మూవీలో ఒక కీల‌క పాత్ర చేయ‌డానికీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. కాక‌పోతే మెగా ఫ్యాన్స్ నుంచి వ‌స్తున్న స్పంద‌న‌తో చిరంజీవి బృందమే వెనుకా ముందూ ఆడుతోంది.

తాజాగా మ‌హేశ్‌కు సంబంధించి ఒక విష‌యం ఆన్‌లైన్‌లో వైర‌ల్ అయింది. అది.. అత‌ను త్వ‌ర‌లో హిమాల‌యాల‌కు విశ్రాంతి నిమిత్తం వెళ్తున్నాడ‌ని! సినిమా సినిమాకీ మ‌ధ్య వ‌చ్చే గ్యాప్‌లో విదేశాల‌కు విహార యాత్ర‌ల‌కు వెళ్ల‌డం మ‌హేశ్ అల‌వాటు. 'స‌రిలేరు నీకెవ్వ‌రు' మూవీ విడుద‌ల‌య్యాక కూడా అలాగే ఫ్యామిలీతో క‌లిసి ఫారిన్ టూర్‌కు వెళ్లొచ్చాడు కూడా. ఇప్పుడు 'ఆచార్య' మూవీ షూట్ విష‌యం తేల‌క‌పోవ‌డం, ప‌ర‌శురామ్‌తో చేసే సినిమాకు ఇంకా స‌మ‌యం ఉండ‌టంతో.. ఈ లోపు హిమాల‌యాల‌కు వెళ్లి, కొద్ది రోజులు అక్క‌డ గ‌డ‌పాల‌ని మ‌హేశ్ భావిస్తున్న‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. త‌ను ఒక్క‌డే వెళ్తాడా లేక ఫ్యామిలీతో వెళ్తాడా? అనే విష‌యం మాత్రం వెల్ల‌డి కాలేదు.