English | Telugu

ప్ర‌భాస్ చేతిలో ప‌వ‌ర్ స్టార్ మూవీ రిలీజ్ డేట్‌!

నిజ‌మే. ప్ర‌భాస్ హీరోగా 'జిల్' ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న 'ఓ డియ‌ర్' మూవీ విడుద‌ల తేదీపై ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా విడుదల తేదీ ఆధార‌ప‌డింది. 'ఓ డియ‌ర్' షూటింగ్ ప్ర‌స్తుతం యూర‌ప్‌లో జ‌రుగుతోంది. ఇటీవలే ప్ర‌భాస్‌, పూజా హెగ్డే, ఇత‌ర ప్ర‌ధాన తారాగ‌ణం, టెక్నీషియ‌న్లు అక్కడికి వెళ్లారు. న‌వంబ‌ర్‌లో దీపావ‌ళికి ఈ సినిమాని రిలీజ్ చేయాల‌ని నిర్మాణ సంస్థ‌లు గోపీకృష్ణా మూవీస్‌, యువీ క్రియేష‌న్స్ సంస్థ‌లు నిర్ణ‌యించాయి. ఒక‌వేళ దీపావ‌ళికి విడుద‌ల చేయ‌లేక‌పోతే డిసెంబ‌ర్‌లో క్రిస్ట‌మ‌స్‌కు రిలీజ్ చేయాల‌ని అవి భావిస్తున్నాయి.

మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, క్రిష్ కాంబినేష‌న్ మూవీని కూడా దీపావ‌ళికే తీసుకురావాల‌ని నిర్మాత ఎ.ఎం. ర‌త్నం సంక‌ల్పించారు. ఈ సినిమా కోసం 'విరూపాక్ష'‌, 'వారాహి' అనే టైటిల్స్‌ను రిజిస్ట‌ర్ చేశారు. వీటిలో 'విరూపాక్ష' వైపే ఎక్కువ‌మంది మొగ్గు చూపుతున్నారు. కాసేపు మ‌నం 'విరూపాక్ష' టైటిల్‌తోటే ఈ సినిమాను ప్ర‌స్తావించుకుందాం. 'ఓ డియ‌ర్' క‌నుక దీపావ‌ళికి వ‌చ్చేట్ల‌యితే 'విరూపాక్ష‌'ను క్రిస్ట‌మ‌స్‌కు తేవ‌డానికి ర‌త్నం సిద్ధంగా ఉన్నారు. ఈ మేర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. అంటే బంతి ఇప్పుడు ప్ర‌భాస్ కోర్టులో ఉంద‌న్న మాట‌. 'ఓ డియ‌ర్' కంటే చాలా లేటుగా షూటింగ్ మొద‌లుపెట్టినా 'విరూపాక్ష‌'ను చ‌క‌చ‌కా తీసుకుంటూ పోతున్నాడు క్రిష్‌. ఆ మూవీతో పోలిస్తే 'ఓ డియ‌ర్' షూటింగ్ నెమ్మ‌దిగా న‌డుస్తోంది.

ఇప్ప‌టివ‌ర‌కైతే ఒక విష‌యం మాత్రం స్ప‌ష్టం. రెండు సినిమాలూ 2020లోనే విడుద‌ల కావడం ల‌క్ష్యంగా పెట్టుకున్నాయి. 2021 సంక్రాంతికి రాజ‌మౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్' వ‌స్తోంది కాబ‌ట్టి, 'ఓ డియ‌ర్' 2021 వేస‌వికి విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే. అయితే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని ప్ర‌భాస్ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉండ‌టంతో డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ అందుకు అనుగుణంగా వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు. సో.. 'ఓ డియ‌ర్' రిలీజ్ డేట్‌ను బ‌ట్టి త‌మ సినిమా విడుద‌ల‌ను ప్లాన్ చేయాల‌ని ఇప్ప‌టికే 'విరూపాక్ష' బృందం డిసైడ‌య్యింది. అది దీపావ‌ళి కావ‌చ్చు, లేదా క్రిస్ట‌మ‌స్ కావ‌చ్చు.