English | Telugu

నితిన్ పెళ్లి వాయిదా?

దుబాయ్‌లో డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకుందామ‌నుకుంటున్న నితిన్ ఆశ‌ల‌పై క‌రోనా వైర‌స్ నీళ్లు చ‌ల్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఐదారేళ్లుగా తాను ప్రేమిస్తోన్న షాలినితో దుబాయ్‌లో ఏప్రిల్ 15న నిశ్చితార్ధం, 16న పెళ్లి చేసుకోవ‌డానికి నితిన్ ముహూర్తం ఖ‌రారు చేసుకున్న విష‌యం విదిత‌మే. దీని కోసం అక్క‌డి విలాస‌వంత‌మైన పాలాజ్జో వ‌ర్సేస్ హోటల్‌ను బుక్ చేసుకున్నారు కూడా. అయితే క‌రోనా కేసులు రోజు రోజుకూ అనూహ్యంగా పెరిగిపోతుండ‌టంతో డెస్టిన్ వెడ్డింగ్ ఇర‌కాటంలో ప‌డింది. సౌదీ అరేబియాలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 118కి చేరింది. ఎక్కువ‌గా ఇత‌ర దేశాల నుంచి వ‌స్తున్న వాళ్ల‌లోనే ఈ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డుతుండ‌టంతో సౌదీ అరేబియాలో ఆంక్ష‌లు, నిబంధ‌న‌లు ఎక్కువ‌వుతున్నాయి.

అలాగే, సౌదీ నుంచి వ‌చ్చే ప్ర‌యాణీకుల విష‌యంలోనూ ఇత‌ర దేశాలు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వంద‌మంది అతిథుల స‌మ‌క్షంలో దుబాయ్‌లో పెళ్లి చేసుకుందామ‌నే ఆలోచ‌న‌తో ఉన్న నితిన్‌కు.. అది క‌ష్ట‌సాధ్యంగా మారే అవ‌కాశం ఉంది. పెళ్ల‌నేది ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంలో జ‌ర‌గాల్సిన వేడుక కాబ‌ట్టి, విప‌రీత‌మైన ఒత్తిడి, భ‌యాల మ‌ధ్య దుబాయ్‌కు వెళ్లి పెళ్లి చేసుకోవ‌వ‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట‌నే చ‌ర్చ ఇప్ప‌టికే రెండు కుటుంబాల్లో న‌డుస్తోంది. ఒక‌వేళ దుబాయ్‌లోనే పెళ్లి చేసుకోవాల‌నుకుంటే, ఏప్రిల్ ముహూర్తం కాకుండా త‌ర్వాత ఎప్పుడైనా వేరే ముహూర్తం నిర్ణ‌యించాల్సి ఉంటుంద‌ని నితిన్ స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. ఏప్రిల్ ముహూర్తంలోనే పెళ్లాడాల‌నుకుంటే ప్ర‌స్తుత క‌రోనా భ‌యం కాలంలో ఎక్క‌డికో వెళ్లి చేసుకొనే కంటే హైద‌రాబాద్‌లోనే పెళ్లి చేసుకోవ‌డం ఉత్త‌మ‌మ‌ని పెద్ద‌లు భావిస్తున్నారు.

దుబాయ్‌లో పెళ్లికి మార్గాలు త‌క్కువ‌గా ఉంటే హైద‌రాబాద్‌లోనే పెళ్లి ఏర్పాట్లు చేయ‌డానికి ఇదివ‌ర‌కే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు నితిన్ తండ్రి సుధాక‌ర్‌రెడ్డి తెలిపారు. నితిన్ పెళ్లి వేదిక‌ను మార్చే ఆలోచ‌న‌లో ఉన్నామ‌ని ఆయ‌న చెప్పారు. పెళ్లి వాయిదా ఆలోచ‌న అయితే లేద‌ని, అతిథుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌లిగించ‌ని రీతిలో ఇక్క‌డే పెళ్లి ఏర్పాట్లు చేయ‌డానికి కూడా సిద్ధంగా ఉన్నామ‌ని ఆయ‌న తెలిపారు.