English | Telugu

'మ‌జిలీ' త‌ర్వాత మ‌రోసారి జంట‌గా...

వివాహానంత‌రం నాగ‌చైత‌న్య‌, స‌మంత తొలిసారి క‌లిసి న‌టించిన 'మ‌జిలీ' మూవీ సూప‌ర్ హిట్ట‌యింది. న‌టులుగా ఆ ఇద్దరికీ ఆ సినిమా చాలా పేరు తెచ్చింది. దాని త‌ర్వాత మ‌రోసారి ఆ ఇద్ద‌రినీ తెర‌పై జంట‌గా చూడాల‌ని అక్కినేని ఫ్యాన్స్‌గా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కొంత‌మంది డైరెక్ట‌ర్లు ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేసినా స‌క్సెస్ కాలేక‌పోయారు. స్క్రిప్టు విష‌యంలో స‌మంత సంతృప్తి చెంద‌క‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం. ఇప్పుడు ఆ ఇద్ద‌రితో ఓ సినిమా చెయ్య‌డానికి డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

విక్ర‌మ్ డైరెక్ట్ చేసిన 'మ‌నం' మూవీలో చైతూ, స‌మంత జంట‌గా న‌టించారు. అది కాకుండా సూర్య‌తో విక్ర‌మ్ తీసిన '24'లోనూ స‌మంత నాయిక‌గా న‌టించింది. ఇప్పుడు విక్ర‌మ్ చెప్పిన స్క్రిప్టుకు చైతు, స‌మంత ఇద్ద‌రూ ఇంప్రెస్ అయ్యార‌ని తెలుస్తోంది. మొద‌ట చైతూతో ఓకే అనిపించుకున్న విక్ర‌మ్‌, త‌ర్వాత స‌మంత నుంచీ గ్రీన్ సిగ్న‌ల్ అందుకున్నాడ‌ని అంటున్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమాలు రూపొందించ‌డంలో నేర్ప‌రి అయిన విక్ర‌మ్.. అలాంటి ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌ను వినిపించాడ‌నీ, అది విన‌గానే స‌మంత ఉద్వేగానికి గుర‌య్యింద‌నీ ఆమె స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. దిల్ రాజు నిర్మించే ఈ మూవీ 2021లో సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం.