English | Telugu

చరణ్, కొరటాల కాంబోలో పాన్ ఇండియా మూవీ!

'ఆచార్య' సినిమా తర్వాత డైరెక్టర్ కొరటాల శివ వరుస పాన్ ఇండియా సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆయన తెరకెక్కించనున్న పాన్ ఇండియా మూవీ త్వరలో పట్టాలెక్కనుంది. ఆ తర్వాత రామ్ చరణ్ తో కూడా కొరటాల ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నారని తెలుస్తోంది.

చిరంజీవి హీరోగా కొరటాల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఆచార్య'. రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 29 న విడుదల కానుంది. ఇక మార్చి 25 న 'ఆర్ఆర్ఆర్'తో ప్రేక్షకులను పలకరించనున్న తారక్.. తన తర్వాతి సినిమా కొరటాల దర్శకత్వంలో చేయనున్నాడు. 'జనతా గ్యారేజ్' తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత 'ఆర్ఆర్ఆర్'లో నటించిన మరో స్టార్ చరణ్ తో కూడా కొరటాల సినిమా చేయనున్నారని టాక్.

చరణ్-కొరటాల కాంబినేషన్ లో గతంలోనే ఓ సినిమా రావాల్సి ఉండగా అది కార్యరూపం దాల్చలేదు. అయితే 'ఆచార్య'లో చరణ్ కీలక పాత్రలో నటించడంతో వీరి కాంబినేషన్ లో సినిమా చూడాలనుకున్న ఫ్యాన్స్ కోరిక కొంత నెరవేరనుంది. అయితే ఇప్పుడు వీరి కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ రానుందన్న న్యూస్ ఆసక్తికరంగా మారింది. చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత శంకర్, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్స్ లైన్స్ ఉన్నాయి. వీటి తర్వాత చరణ్-కొరటాల కాంబోలో సినిమా వచ్చే అవకాశముంది.