English | Telugu
40 ఏళ్ళ తరువాత అంధుడిగా కమల్?
Updated : Jul 16, 2021
లోకనాయకుడు కమల్ హాసన్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `అమావాస్య చంద్రుడు`(1981) ఒకటి. తమిళంలో `రాజా పార్వై` పేరుతో రూపొందిన ఈ బైలింగ్వల్ మూవీలో అంధుడి పాత్రలో కనిపించారు కమల్. దిగ్గదర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా.. నటుడిగా కమల్ కి 100వ చిత్రం. అంతేకాదు.. నిర్మాతగా తొలి ప్రయత్నం. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా కమల్ కి `బెస్ట్ యాక్టర్`గా `ఫిల్మ్ ఫేర్` అవార్డుని అందించినప్పటికీ.. కమర్షియల్ గా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కాకపోతే కమల్ పోషించిన విభిన్న పాత్రల్లో ఒకటిగా ఇందులోని రఘు పాత్ర నిలిచిపోయింది.
కట్ చేస్తే.. 40 ఏళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం మరోమారు కమల్.. అంధుడి పాత్రలో కనిపించనున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. `ఖైదీ`, `మాస్టర్` చిత్రాల దర్శకుడు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో `విక్రమ్` పేరుతో కమల్ ఓ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి మేటినటులు ఇందులో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కాగా, ఇందులో కథానుసారం చూపు లేని వ్యక్తిగా కమల్ దర్శనమివ్వనున్నట్లు సమాచారం. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.