English | Telugu
'మేడ్ ఇన్ ఇండియా'లో ఎన్టీఆర్.. రాజమౌళి కోసమే ఒప్పుకున్నాడా?
Updated : Sep 20, 2023
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'స్టూడెంట్ నెం.1' చిత్రంతోనే దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు రాజమౌళి. ఆ తర్వాత వీరి కలయికలో 'సింహాద్రి', 'యమదొంగ', 'ఆర్ఆర్ఆర్' వంటి సినిమాలు రాగా అన్నీ ఘన విజయం సాధించాయి. అందుకే టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో ఒకటిగా వీరి కాంబో పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు వీరు మరో సినిమా కోసం చేతులు కలపబోతున్నారు. కానీ ఈ సినిమాకి రాజమౌళి దర్శకుడిగా కాదు, సమర్పకుడిగా వ్యవహరించనున్నారు.
రీసెంట్ గా రాజమౌళి సమర్పణలో వరుణ్ గుప్తా, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మాతలుగా 'మేడ్ ఇన్ ఇండియా' అనే సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ గా రూపొందనున్న ఈ సినిమాకి నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ చిత్రంలో దాదా సాహెబ్ ఫాల్కే పాత్రలో ఎన్టీఆర్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న దేవర తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత వార్-2, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్నప్పటికీ కేవలం రాజమౌళి కోసమే 'మేడ్ ఇన్ ఇండియా' చేయడానికి ఎన్టీఆర్ ఒప్పుకున్నారని న్యూస్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.