English | Telugu

యన్ టి ఆర్, లోకేష్ ల మధ్య ఆధిపత్య పోరు

యన్ టి ఆర్, లోకేష్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే యంగ్ టైగర్ యన్ టి ఆర్ కి తన తాతయ్య నందమూరి తారక రామారావు అంటే ఎనలేని భక్తి, గౌరవం. జూనియర్ యన్ టి ఆర్ కి దేవుడంటే అతని తాతగారే. అలాంటి తాతయ్య పెట్టిన తెలుగు దేశం పార్టీని తన మామయ్య నారా చంద్రబాబునాయుడు మెల్లగా కబ్జా చేయటమే కాకుండా, తన కుమారుడు నారా లోకేష్ కి తెలుగు దేశం పార్టీ పగ్గాలను అప్పగించే ప్రయత్నాలు కూడా ప్రారంభించారు.

అందులో భాగంగానే నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణినిచ్చి పెళ్ళి చేయటంలోనూ, అలాగే తన మేనకోడలు మల్లిక కుమార్తె లక్ష్మీ ప్రణతిని జూనియర్ యన్ టి ఆర్ కిచ్చి వివాహం జరిపించటంలోనూ కూడా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకి సంబంధించిన రాజకీయ చతురతను దూరదృష్టితో ప్రదర్శించారు. ఇది లోతుగా విశ్లేషిస్తే కానీ మనకు కనిపించదు. చాలా మంది తెలుగు దేశం పార్టీ అభిమానుల్లో నందమూరి వారు స్థాపించిన పార్టీలో నారా వారి పెత్తనం ఉండటం మింగుడు పడటం లేదు. దానికి తోడు ఇప్పటికే నారా లోకేష్ పార్టీలో చక్రం తిప్పటం మొదలెట్టాడు. అది మరింతగా కొంతమంది నందమూరి అభిమానుల్ని బాధిస్తుంది.

 

ఇలాంటి వాటికన్నింటికీ చక్ పెట్టటానికి జూనియర్ యన్ టి ఆర్ తన మామ నార్నే శ్రీనివాస్ సహాయం తీసుకుంటున్నాడట. ఇప్పటి వరకూ లోకేష్ చేతిలో ఉన్న "స్టుడియో- యన్" పగ్గాలు తన చేతిలోకి తీసుకుని తను నటించే సినిమాల ప్రమోషన్ కోసం వాడుకోవాలనీ, తద్వారా లోకేష్ కి రానున్న పబ్లిసిటీని అడ్డుకుంటూ తనని తాను పెంచుకోటానికీ, భవిష్యత్తులో తన తాత స్థాపించిన పార్టీని తాను స్వాధీన పరచుకోటానికీ ఎత్తులు వేస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాలనుకుంటున్నాయి.