English | Telugu

గోవిందుడుకి ముందే న‌ష్టాలొచ్చాయా?

పేరుకే స్టార్ హీరో సినిమా. కానీ ఏం లాభం?? కొనేవాడెవ‌రు?? పెద్ద సినిమా అంటే త‌ల్ల‌డిల్లిపోతున్నారు బ‌య్య‌ర్లు. ర‌భ‌స‌, ఆగ‌డు నేర్పిన పాఠాల‌తో బయ్య‌ర్లు ముందే అప్ర‌మ‌త్త‌మైపోతున్నారు. పెద్ద సినిమాల్ని కొనే ముందు ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించుకొంటున్నారు. అందుకే గోవిందుడు అందరి వాడేలే సినిమాకీ బ‌య్య‌ర్ల నుంచి క‌ష్టాలు ఎదుర‌య్యాయి. ఈ సినిమాని నైజాంలో కొన‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. చిరు కుటుంబానికి నైజాంలో ప్ర‌తికూల ప‌వ‌నాలు వీస్తుండ‌డంతో.... బ‌య్య‌ర్లు ఈధైర్యం చేయ‌లేక‌పోతున్నారు. మిగిలిన చోట్లా ఇలాంటి ప‌రిస్థితే. కాక‌పోతే.... చిరు సినిమాల‌కు అక్క‌డ శాశ్వ‌త బ‌య్య‌ర్లున్నారు. వాళ్ల‌కు ఏదో రేటు చెప్పి సినిమాని అంట‌గ‌ట్టేశారు. చ‌ర‌ణ్ సినిమాల‌కు సాధార‌ణంగా జ‌రిగే మార్కెట్ ఈ సినిమాకి లేదు. ఎందుకంటే.. కృష్ణ‌వంశీపై ఎవ్వ‌రికీ న‌మ్మ‌కాల్లేవు.

ఆయ‌న ఇది వ‌ర‌కు తీసిన క‌ళాఖండాలు చ‌ర‌ణ్ అభిమానుల్ని, బ‌య‌ర్ల‌ను ఉలిక్కిప‌డేలా చేస్తున్నాయి. దానికి తోడు ఈసినిమారి రీషూట్ చేశారు. రాజ్‌కిర‌ణ్ కి భారీ పారితోషికం ఇచ్చి చ‌ర‌ణ్ తాత‌య్య పాత్ర క‌ోసం తీసుకొన్నారు. అయితే చిరు ఎంట్రీ ఇచ్చి... రాజ్‌కిర‌ణ్‌ని త‌ప్పించాడు. ఆ స్థానం లో ప్ర‌కాష్‌రాజ్‌ని అర్జెంటుగా తీసుకొచ్చారు. అంటే ఒక్క పాత్ర కోసం రెండు పారితోషికాలు చెల్లించార‌న్న‌మాట‌. దానికి తోడు రాజ్‌కిర‌ణ్‌పై తీసిన సీన్స్ మ‌ళ్లీ అదే కాంబినేష‌న్‌తో రీషూట్ చేశారు. ఇలా.... అనుకొన్న బ‌డ్జెట్ కంటే.. మ‌రో రూ.5 కోట్లు ఎక్క‌వ‌య్యాయి. దానికి తోడు నైజాంలో ఈ సినిమా కొనేవాడు లేడు. చివ‌రి క్ష‌ణాల్లో ఈ సినిమాని మంచి రేటుకి అమ్ముకొన్నా... దాదాపు రూ.8 కోట్ల న‌ష్టం రావ‌డం ఖాయ‌మ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి.