English | Telugu
వెంకటేష్‌తో జోడి కట్టబోతున్న గోపీచంద్!?
Updated : Jan 25, 2023
టాలీవుడ్ లోని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో గోపీచంద్ మలినేని ఒకరు. ఈయన కెరీర్ రవితేజ హీరోగా రూపొందిన డాన్ శ్రీనుతో మొదలయింది. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆయన వెంకటేష్‌తో బాడీగార్డ్ అనే రీమేక్ చేశారు. ఈ చిత్రం సరిగా ఆడలేదు. ఆ తర్వాత మళ్లీ రవితేజతో బలుపు చిత్రం తీసి సూపర్ హిట్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత చేసిన రామ్ పండగ చేస్కో, సాయి ధరమ్ తేజ్ విన్నర్ లాంటి సినిమాలు ఆడలేదు. దాంతో మరోసారి అయిన క్రాక్ సినిమాతో రవితేజ ను డిఫరెంట్ గా చూపిస్తూ సూపర్ హిట్ అందుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఈయన రవితేజ తో హ్యాట్రిక్ హిట్స్ తీశారు. తాజాగా ఆయన బాలకృష్ణతో వీరసింహారెడ్డి చిత్రం చేసి నందమూరి అభిమానుల చేత జేజేలు అందుకుంటున్నారు. దాంతో ఆయనకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఆయన ప్రభాస్ సహా మరి కొందరు హీరోలకు కథలు చెప్పారని అవి చర్చల స్టేజిలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
కాగా వెంకటేష్ తో ఆయన బాడీగార్డ్ అనే సాధారణ చిత్రాన్ని అందించినప్పటికీ వెంకటేష్ మరోసారి గోపీచంద్ మల్లినేనితో జోడి కట్టేందుకు సిద్ధంగా ఉన్నాడని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రంలో గోపీచంద్ మలినేనితో కలిసి వెంకీ ప్రాజెక్టును సెట్ చేయాలని సూర్యదేవర నాగవంశీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. చివరిగా ఎఫ్ 3 చిత్రంతో వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఎఫ్2 తో పోల్చుకుంటే ఎఫ్3 కేవలం యావరేజ్ ఫలితాన్ని మాత్రమే అందుకుంది. ఇక తాజాగా తన 75 వ చిత్రాన్ని వెంకటేష్ హిట్ ఫ్రాంచైజీ సినిమాలతో ఊపు మీద ఉన్న డైరెక్టర్ శైలేష్ కొలనుతో ఓ చిత్రం ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చిందో లేదో వెంకటేష్‌తో గోపీచంద్ కూడా సినిమా చేసేందుకు రంగం సిద్ధమైందని వార్త తెరపైకి వచ్చింది. ప్రస్తుతం గోపీచంద్ వీరసింహారెడ్డి సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రం నందమూరి బాలయ్య కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా నిలిచింది.