English | Telugu

రికార్డు స్థాయిలో హిందీ ‘విశ్వంభర’ రైట్స్‌... అదీ మెగాస్టార్‌ రేంజ్‌!

రికార్డు స్థాయిలో హిందీ ‘విశ్వంభర’ రైట్స్‌... అదీ మెగాస్టార్‌ రేంజ్‌!

కలెక్షన్ల సునామీ సృష్టించాలన్నా, రికార్డులు సృష్టించాలన్నా ఇప్పుడు సౌత్‌ సినిమాలకే సాధ్యం అనేది దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ. ఈ విషయంలో బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఒక క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే సౌత్‌లో ఏయే సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి, ఎప్పుడు రిలీజ్‌ అవుతాయి అనే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారట. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లు సౌత్‌ సినిమాలతో మంచి బిజినెస్‌ చెయ్యొచ్చనే ఆలోచనలో ఉన్నారు. బాహుబలితో మొదలై సాహో, కెజిఎఫ్‌, సలార్‌, కల్కి, పుష్ప వంటి సినిమాలు బాలీవుడ్‌లోనూ మంచి విజయం సాధించాయి, మంచి కలెక్షన్లు రాబట్టాయి. అందుకే ఇప్పుడు బాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాలు త్వరలో రాబోతున్న ‘విశ్వంభర’పై దృష్టి పెట్టాయి. 

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వంభర’ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అందుకే హిందీ థియేట్రికల్‌ రైట్స్‌కి పోటీ ఏర్పడింది. హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ రూ.38 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. ‘పుష్ప2’ హిందీ వెర్షన్‌ రూ.1000 కోట్లు కలెక్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ‘విశ్వంభర’ చిత్రం హిందీ వెర్షన్‌ని భారీ మొత్తంతో కొనుగోలు చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా పీక్స్‌లో ఉన్న సమయంలో హిందీలో డైరెక్ట్‌గా కొన్ని సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి తొలిసారిగా ఓ పాన్‌ ఇండియా మూవీ చేస్తుండడంతో బిజినెస్‌ పరంగా క్రేజ్‌ ఏర్పడింది. సోషియో ఫాంటసీ మూవీ కావడంతో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే అనేక అంశాలు సినిమాలో ఉంటాయి. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించే అవకాశం ఉండడంతో ఈ సినిమాని భారీ రేటుకు కొనుగోలు చేశారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ విజువల్‌ వండర్‌ని నిర్మిస్తోంది. 

నిజానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ, వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ చాలా ఉండడంతో పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ఇంకా పూర్తి కాలేదు. గత కొన్ని నెలలుగా ఈ వర్క్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మేలో చిత్రాన్ని విడుదల చెయ్యాలన్నది మేకర్స్‌ ప్లాన్‌. అయితే రిలీజ్‌ ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ లేదు. త్వరలోనే అధికారికంగా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. గతంలో చిరంజీవి చేసిన జగదేకవీరుడు అతిలోక సుందరి సోషియో ఫాంటసీ మూవీగా ఎంత ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ‘విశ్వంభర’ దాన్ని మించిన స్థాయిలో ఉంటుందని మేకర్స్‌ కాన్ఫిడెంట్‌ ఉన్నారు.