English | Telugu
ఆగిపోయిన 'డబుల్ ఇస్మార్ట్'.. కారణమదేనా?
Updated : Mar 28, 2024
ఒక హిట్ సినిమాకి సీక్వెల్ వస్తుందంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఉండటం సహజం. ఆ అంచనాలకు తగ్గట్టుగానే బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. అయితే అలా బడ్జెట్ పెరగడం కారణంగానే ఓ క్రేజీ సీక్వెల్ ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఆ సీక్వెల్ ఏదో కాదు.. 'డబుల్ ఇస్మార్ట్'(Double iSmart).
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni), డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannadh) కాంబినేషన్ లో రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' 2019 జులైలో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ మాస్ ఎంటర్టైనర్ కి సీక్వెల్ గా పూరి కనెక్ట్స్ బ్యానర్ లో 'డబుల్ ఇస్మార్ట్' రూపొందుతోంది. 2024, మార్చి 8న పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేయనున్నట్లు గతేడాది మూవీ అనౌన్స్ మెంట్ సమయంలోనే మేకర్స్ ప్రకటించారు. కానీ మార్చి అయిపోయి ఏప్రిల్ కూడా వస్తుంది. సినిమా రిలీజ్ సంగతి అటుంచితే కనీసం టీజర్ కూడా విడుదల కాలేదు. మొదట్లో షూటింగ్ అప్డేట్స్, ఆ తర్వాత ఒకట్రెండు పోస్టర్లు తప్ప.. కొంతకాలంగా ఈ సినిమా నుంచి సరైన అప్డేట్స్ లేవు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే.. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టారట. దానికి కారణం బడ్జెట్ సమస్యలు అని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యేలా కొంతకాలంగా ఇతర నిర్మాణ సంస్థలతో పూరి అండ్ టీం చర్చలు జరుపుతున్నారట. అప్పటి వరకు షూటింగ్ హోల్డ్ లో పడిందనే విషయం బయటకు తెలియకూడదన్న ఉద్దేశంతో అప్పుడప్పుడు పోస్టర్లు వదులుతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఓ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' త్వరగా బడ్జెట్ సమస్యల నుంచి బయటపడుతుందేమో చూడాలి.