English | Telugu

తార‌క్ మూవీ కోసం 'కేజీఎఫ్' డైరెక్ట‌ర్‌కు భారీ అడ్వాన్స్‌?

య‌శ్ హీరోగా రూపొందించిన 'కేజీఎఫ్' మూవీ బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డంతో డైరెక్ట‌ర్‌గా ప్ర‌శాంత్ నీల్ పేరు దేశ‌వ్యాప్తంగా మారుమోగింది. ఇప్పుడ‌త‌ను 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' మూవీని తీస్తున్నాడు. 2020 మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ఒక‌టిగా ఇది పేరు తెచ్చుకుంది. ఈ మూవీ త‌ర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేయ‌నున్నాడ‌నేది స‌మాచారం. దీని కోసం అడ్వాన్స్ కింద ఏకంగా రూ. 2 కోట్లు అత‌నికి అందాయ‌ని ఆన్‌లైన్‌లో విరివిగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ కాంబినేష‌న్ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది. ఈ ప్రాజెక్ట్‌ను జార‌విడుచుకోకూడ‌ద‌నే ఉద్దేశంతో ప్ర‌శాంత్‌కు నిర్మాత‌లు ఈ రేంజ్‌లో అడ్వాన్స్ ఇచ్చార‌ని చెప్పుకుంటున్నారు.

అయితే తార‌క్‌, ప్ర‌శాంత్ నీల్ క‌లిసి ప‌నిచేసే సినిమా ఈ ఏడాది కానీ, వ‌చ్చే ఏడాది కానీ స్టార్ట‌య్యే అవ‌కాశాలు లేవు. కార‌ణం, రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తార‌క్ చేస్తోన్న 'ఆర్ఆర్ఆర్' మూవీ వచ్చే ఏడాది రిలీజ‌వ‌నుంది. దాని త‌ర్వాత త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో అత‌ను న‌టించ‌నున్నాడు. అంటే ప్ర‌శాంత్ డైరెక్ష‌న్‌లో అత‌ను చేసే సినిమా 2022లో మొద‌లు కానున్న‌ద‌న్న మాట‌. కాక‌పోతే ఇంత దాకా ఈ మూవీపై అధికారిక స‌మాచారం అనేది ఏమీ లేదు. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2'ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. అక్టోబ‌ర్ 23న దాన్ని రిలీజ్ చేయాల‌నేది నిర్మాత‌ల సంక‌ల్పం.