English | Telugu

'స‌ర్కార్ వారి పాట' పాడ‌నున్న మ‌హేశ్‌?

'స‌రిలేరు నీకెవ్వ‌రు' వంటి కెరీర్ హ‌య్యెస్ట్ గ్రాస‌ర్ మూవీ త‌ర్వాత మ‌హేశ్ చేసే త‌ర్వాతి సినిమా కోసం ఫ్యాన్స్ అమితాస‌క్తితో ఎదురు చూస్తున్నారు. 'గీత గోవిందం' మూవీతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్నీ మంత్ర‌ముగ్ధుల్ని చేసిన ప‌ర‌శురామ్ డైరెక్ష‌న్‌లో న‌టించేందుకు మ‌హేశ్ సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ మూవీని మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న‌ది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ బ్యాన‌ర్‌కు మ‌రో బ్యాన‌ర్ తోడ‌వుతోంది. అది 14 రీల్స్ ప్ల‌స్‌. అంతే కాదు.. ఈ మూవీ టైటిల్ ఇదేనంటూ తాజాగా ఓ టైటిల్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అది.. 'స‌ర్కార్ వారి పాట‌'!

అవును. మ‌హేశ్ హీరోగా న‌టించే 27వ సినిమాకు ఈ టైటిల్ నిర్ణ‌యించారంటూ జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని మ‌హేశ్ ఫ్యాన్స్ వైర‌ల్ చేస్తున్నారు. ఈ టైటిల్ ఖాయ‌మైతే గూస్‌బంప్స్ వ‌స్తున్నాయ‌ని వారు కామెంట్స్ కూడా పెడుతున్నారు. 'గీత గోవిందం' వంటి కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ తీసిన ప‌ర‌శురామ్‌.. ఇప్పుడు 'స‌ర్కార్ వారి పాట' అనే టైటిల్‌తో మ‌హేశ్‌తో సినిమా తీయ‌డం ఖాయ‌మైతే త‌ప్ప‌కుండా అది మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ అవుతుంద‌ని భావించ‌వ‌చ్చు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మ‌ల‌యాళీ అయిన గోపీసుంద‌ర్ పేరు వినిపించింది. ఇప్పుడు అత‌ని స్థానంలో త‌మ‌న్ వ‌చ్చాడంటున్నారు. అంతేకాదు, హీరోయిన్‌గా 'భ‌ర‌త్ అనే నేను' ఫేమ్‌ కియారా అద్వానీ న‌టించ‌డం కూడా ఖాయ‌మ‌ని చెప్పుకుంటున్నారు. ఈ ప్ర‌చారంలో ఏ మేర‌కు నిజ‌ముంద‌నేది మే 31న తేల‌నున్న‌ది. సూప‌ర్‌స్టార్ కృష్ణ జ‌న్మ‌దినం అయిన ఆ రోజు మ‌హేశ్‌, ప‌ర‌శురామ్ కాంబినేష‌న్ మూవీ గురించిన అఫిషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.