English | Telugu

ఓటీటీలో 'నిశ్శ‌బ్దం'గా..?

న‌మ్మ‌శ‌క్యం కాని ప్ర‌చారం ప్ర‌కారం.. అనుష్క‌, మాధ‌వ‌న్ జోడీగా న‌టించిన 'నిశ్శ‌బ్దం' చిత్రాన్ని నిర్మాత‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. నిర్మాత‌ల నుంచి అధికారికంగా ఎలాంటి ధ్రువీక‌ర‌ణ లేక‌పోయినా, ఈ వార్త ఇప్పుడు సౌతిండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతూ, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్‌గా నిర్మాణ‌మ‌వుతున్న ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ను హేమంత్ మ‌ధుక‌ర్ డైరెక్ట్ చేస్తున్నాడు. అనేక‌సార్లు ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.

టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి గోపీసుంద‌ర్ మ్యూజిక్ అందించ‌గా, షానీల్ డియో సినిమాటోగ్రాఫర్‌గా ప‌నిచేశాడు. ట్రైల‌ర్ విడుద‌ల‌య్యాక నీర‌జ కోన కాస్ట్యూమ్ డిజైన్స్‌ను అంద‌రూ ప్ర‌శంసించారు. 'ప్ర‌తి ఒక్క‌రూ అనుమానితులే' అనే క్యాప్ష‌న్ అంద‌రిలోనూ కుతూహ‌లాన్ని పెంచేసింది. 'కిల్ బిల్' ఫేమ్ మైఖేల్ మ్యాడ్స‌న్ న‌టించ‌డం ఈ సినిమాకు ఇంట‌ర్నేష‌న‌ల్ లుక్ తీసుకువ‌చ్చింది. ఒక మ‌ర్డ‌ర్ వెనుక ఉన్న మిస్ట‌రీని ఛేదించ‌డానికి నియ‌మితుడైన పోలీసాఫీస‌ర్‌గా ఆయ‌న క‌నిపించ‌నున్నాడు.

సుంద‌ర్ సి. డైరెక్ట్ చేసిన త‌మిళ ఫిల్మ్ 'రెండు' (2006) త‌ర్వాత అనుష్క‌, మాధ‌వ‌న్ మ‌ళ్లీ క‌లిసి న‌టించింది 'నిశ్శ‌బ్దం'లోనే. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేశారు. ఈ మూవీలో అనుష్క ఒక మూగ‌, చెవిటి చిత్ర‌కారిణిగా న‌టించింది. ఇప్పుడు థియేట‌ర్ల‌లో కాకుండా ఓటీటీలో ఈ సినిమా నేరుగా విడుద‌ల కానున్న‌ద‌నే ప్ర‌చారం సౌత్ ఇండ‌స్ట్రీని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.