English | Telugu

చిరు 150వ సినిమా చేయాల్సిందే

ప‌న్నెండు గంట‌ల పాటు ఏక‌ధాటిగా సాగిన మేము సైతం టెలీ మార‌థాన్‌లో బాల‌య్య ఆట‌పాట‌, వెంకీ హంగామా గురించి జ‌నం ఆస‌క్తిగా చ‌ర్చించుకొన్నాడు. హంగామా అంతా ఈ ఇద్ద‌రిదే అనుకొన్నారు. అయితే చివ‌ర్లో స్టెప్పులేసిన చిరు అంద‌రి దృష్టినీ త‌న‌వైపుకు తిప్పుకొన్నాడు. బేగం పేట బుల్లెమ్మో.. పాట‌కు చిరు వేసిన స్టెప్పులు అందర‌నీ ఆక‌ట్టుకొన్నాయి. డాన్స్ లో చిరు క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికీ ఆయ‌న స్టెప్పేస్తే... ఒళ్లంతా క‌ళ్లు చేసుకొని చూడ్డానికి కోట్లాదిమంది రెడీ. ఆయ‌న స్టెప్పులేసి దాదాపు ఏడేళ్ల‌య్యింది. ఇంత సుదీర్ఘ‌విరామం త‌ర‌వాత స్టేజ్‌పై చిరు వేసిన స్టెప్పులు... ఆయ‌న అభిమానుల్లో ఫుల్ జోష్‌ని నింపేశాయి. చిరు డాన్సింగ్ హంగామా అయిన త‌ర‌వాత జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌లాంటి ఒక‌ప్ప‌టి తార‌లంతా ఆయ‌న చుట్టూ చేరి.. ''మీరు 150వ సినిమా చేయాల్సిందే'' అని ప‌ట్టుప‌ట్టారు. అంత్యాక్ష‌రి స‌మ‌యంలోనూ చిరు సినిమా గురించి అర‌వింద్ - చిరంజీవిల మ‌ధ్య చ‌ర్చ సాగింది.

''అంత్యాక్ష‌రి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌వాళ్లంతా ఒక్కోక్క టీమ్ నుంచి ల‌క్ష రూపాయ‌లు విరాళంగా ఇవ్వాలి'' అని అర‌వింద్ సూచించారు. ''ఇక్క‌డ నా నిర్మాత‌లున్నారు క‌దా, అడ్వాన్సు రూపంలో ఆ ల‌క్ష ఇచ్చేయండి..'' అని చిరు కూడా స‌ర‌దాగా కౌంట‌ర్ వేశాడు. ''మీరు 150వ సినిమా చేస్తానంటే ల‌క్షేంటి, రెండు ల‌క్ష‌లు అడ్వాన్సుగా ఇచ్చేస్తా'' అంటూ అర‌వింద్ కూడా గ‌ట్టిగానే బ‌దులిచ్చారు. అలా... చిరు 150వ సినిమా గురించి మ‌రోసారి ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగింది. చిరు జోష్, డాన్సుల్లో ఆయ‌న గ్రేస్ చూస్తుంటే.. త‌ప్ప‌కుండా ఆయ‌న 150వ సినిమా కోసం ప్రిపేర్ అయిపోతున్న‌ట్టే ఉంది. మెగా అభిమానుల‌కు ఇంత‌కంటే శుభ‌వార్త ఇంకేముంటుంది??