English | Telugu

పూరి మ‌రీ శ్రుతి మించిపోయాడా??

టెంప‌ర్ విజ‌యం ఎన్టీఆర్‌కి ఎంత అవ‌స‌ర‌మో, పూరి జ‌గ‌న్నాథ్‌కీ అంతే అవ‌స‌రం. ఆంధ్రావాలాలో చేసిన త‌ప్పుల్ని స‌రిద్దిద్దుకోవ‌డానికి పూరికి దొరికి అవ‌కాశం. కాబ‌ట్టి టెంప‌ర్ విష‌యంలో త‌ప్ప‌కుండా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొనే ఉంటాడు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ న‌మ్ముతున్నారు. త‌న‌లోని టాలెంట్ అంతా ఈ సినిమా కోసం గుమ్మ‌రించి ఉంటాడ‌ని ఆశ ప‌డుతున్నారు. ఈ సినిమాకి ఎక్కువ రాయాలి, బాగా రాయాలి, అదిరిపోయేలా రాయాలి...అని పూరి భావించాడేమో.. చివ‌రికి ఏదేదో రాసేశాడ‌ట‌. ఔను.. టెంప‌ర్ సెన్సార్ రిపోర్ట్ చూస్తేనే ఈవిష‌యం అర్థ‌మ‌వుతుంది. ఈ సినిమాకి ఏకంగా 18 క‌ట్స్ చెప్పారు సెన్సార్ వాళ్లు. పూరి మాట‌లు సాధార‌ణంగా నాటుగాఉంటాయి. ఈ సినిమాలో ఆ నాటుద‌నం ఇంకొంచెం ఎక్కువైంద‌ని టాక్‌. డైలాగుల్లో బూతులు కూడా ధ్వ‌నించాయ‌ట‌. ఎప్పుడూ లేనంత‌గా డ‌బుల్ మీనింగ్ ప‌దాలు వాడేశాడ‌ట‌. ''నుంచుని ప్లే చేయ‌మంటారా, లేదంటే కూర్చుని ప్లే చేయ‌మంటారా..మీరు ఎలా కంఫ‌ర్ట్‌గా ఫీలైతే అలా కంఫ‌ర్ట్‌గా కూర్చోండి. కూర్చుని స్టార్ట్ చేస్తానండీ,.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో లేచిపోతాను..'' అనే డైలాగే తార్కాణం. ఈ డైలాగ్‌ని సెన్సార్ వాళ్లు క‌త్తిరించారు. దాంతో పాటు గాంధీపైనా కొన్ని డైలాగులున్నాయ‌ట‌. ''గాంధీ గాంధీ అంటూ అరుస్తారెందుకు..?? ఈ దేశంలో జ‌రిగే ప్ర‌తి అవినీతికీ మొద‌టి సాక్షి గాంధే'' అనే డైలాగునీ లేపేశారు. హీరో, విల‌న్‌, హీరోయిన్‌.. ఇలా ప్ర‌తి ఒక్క‌ని నోటి నుంచీ బూతులు ధారాళంగా ప్ర‌వ‌హించాయ‌ట‌. సినిమా మాస్‌కి ఎక్కాల‌న్న తాప‌త్ర‌యం మంచిదే. అది మ‌రీ ముదిరితే మాత్రం చాలా క‌ష్టం. మ‌రి టెంప‌ర్ రిజ‌ల్ట్ ఏమ‌వుతుందో..?????